ప్రభుత్వోద్యోగులకు సరికొత్త ఆరోగ్య పథకం

5 Nov, 2016 03:03 IST|Sakshi
ప్రభుత్వోద్యోగులకు సరికొత్త ఆరోగ్య పథకం

వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి లక్ష్మారెడ్డి

 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (సీజీఈహెచ్‌ఎస్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. మందుల సరఫరా సైతం ఈ పథకంలోకి తీసుకురానుంది. అలాగే ఔట్ పేషంట్ సేవల కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లు నిర్వహించాలని భావిస్తోంది. శుక్రవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మతో కలసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వైద్యపరమైన అంశాలపై చర్చించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (టీజీఈహెచ్‌ఎస్)ను అందుబాటులోకి తెచ్చే అంశంపైనా చర్చించారు. ఖాళీగా ఉన్న 2,118 పోస్టులను భర్తీ చేయాల్సిన పద్ధతులపై సమాలోచనలు చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, నవీన్‌మిట్టల్, జీఏడీ కార్యదర్శి శివశంకర్, న్యాయ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, టీజీఈహెచ్‌ఎస్ సీఈఓ పద్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు