వినుడు..వినుడు ఓట్ల కథ

6 Nov, 2018 10:27 IST|Sakshi
నాంపల్లిలో ఫొటో ఒక్కటే.. పేర్లే వేరు..

చనిపోయినోళ్లు సమాధి నుంచి లేచొస్తారట!  

ఓటరు లిస్టులో వందలాది మృతుల పేర్లు  

మతాలు సైతం మార్చేసిన వైనం  

ఒకే వ్యక్తికి పలు నియోజకవర్గాల్లో ఓట్లు  

ఒక ఫొటోకు వేర్వేరు పేర్లతో ఓటుహక్కు  

నాంపల్లిలో బయటపడుతున్న అక్రమాలు

సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని ఓటరు లిస్టులో గమ్మత్తు విషయాలు బయపడుతున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా తాజా ఓటరు లిస్టులో అలాగే ఉన్నాయి. ఓ మతస్తుడి ఇంట్లో మరో మతానికి చెందిన వారి పేర్లు.. ఒకే నియోజకవర్గంలోని రెండు, మూడు పోలింగ్‌ బూత్‌లలో ఒకే వ్యక్తికి మూడు ఓట్లు నమోదు చేశారు. మరో ఓటరు పేరును అతడుండే ఇంటి నంబర్‌తో నమోదు చేయడంతో పాటు.. అదే ఇంటి నంబర్‌తో అదే వ్యక్తికి మరో నియోజకవర్గంలో సైతం ఓటు ఉండడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్‌ పరిధిలోని ఆయా నియోజకవర్గాల ఓటరు లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీగా తప్పులు దొర్లాయి. ఇదిలా ఉంటే.. సవరణలు సైతం అదేస్థాయి నిర్లక్ష్యంతో చేయడంతో తప్పులు పెరిగాయే కానీ ఏమాత్రం తగ్గింది లేదు.  

మరణించిన వారికీ ఓట్లున్నాయ్‌  
నాంపల్లి నియోజకవర్గం వార్డు నంబర్‌ 12, సర్కిల్‌ నంబర్‌ 7లో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 16, సీరియల్‌ నంబర్‌ 152, ఇంటి నంబర్‌ 10–1–1148లో నివసించే ‘నబి షరీఫ్‌’ ఈ ఏడాది ఫిబ్రవరి 27న మరణించారు. జీహెచ్‌ఎంసీ సైతం మార్చి 3న మరణ ధృవీకరణ ప్రతం జారీ చేసింది. అయినా, ఇతని పేరు ఫొటో ఇంకా ఓటరు లిస్టులోనే ఉంది. ఈ ఏడాదే మరణించాడు కనుక ఓటరు లిస్టు నుంచి తొలగించలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ నాంపల్లి నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 16, సీరియల్‌ నంబర్‌ 555, ఇంటి నంబర్‌ 10–1–1183లో నివసించే ‘రఫత్‌ ఉన్నీసా బేగం’ 2008 సెప్టెంబర్‌ 11న మరణించింది. ఆమె మరణించినట్లు జీహెచ్‌ఎంసీధృవీకరణ పత్రం కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆమె పేరు కూడా తాజా ఓటరు లిస్టులో దర్శనమిస్తోంది. అంటే పదేళ్లుగా ఓటరు లిస్టు నుంచి పేరు తీయలేదంటే అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు, సరవణలు ఎంత జాగ్రత్తగా చేశారో ఇట్టే అర్థం అవుతుంది.

ఓటర్ల మతాలూ మార్చేశారు..  
నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్‌ 11–1–889లో గంగారాం 40 ఏళ్లుగా ఉంటున్నారు. పైగా ఈ ఇంట్లో ఉంటున్నవారిలో 11 మందికి ఓట్లున్నాయి. అయితే, ఈ ఇంటి నంబర్‌పై ఓటరు లిస్టులో 40 ఓట్లు ఉన్నాయి. పైగా ఇక్కడ మరో మతానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఓట్లు సైతం నమోదు చేశారు. తమ ఇంట్లో వేరే మతస్తులు ఏనాడూ లేరని, పైగా 40 మంది ఓట్లు రాయడం దారుణమని గంగారాం కుమారుడు సన్ని యాదవ్‌ ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, ఓటరు లిస్టు నుంచి ఆయా పేర్లు తొలగించలేదన్నారు. తమ బూత్‌ నంబర్‌ 108 ఓటరు లిస్టులో బయటి వారి పేర్లు భారీగా ఉన్నాయని చెప్పారు. 

ఫొటో, పేరు మార్చి డూప్లికేట్‌ ఓట్లు
నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్‌ 10–2–317/76లో నివసిస్తున్న ఎస్‌.మంజుల ఓటు బూత్‌ నంబర్‌ 28, సీరియల్‌ నంబర్‌ 645గా ఓటరు లిస్టులో ఉంది. బూత్‌ నంబర్‌ 25, సీరియల్‌ నంబర్‌ 630 కలీమాబేగం పేరుతో మంజుల ఫొటో పెట్టి డూప్లికేట్‌ ఓటు రూపొం దించారు. ఈ పోలింగ్‌ బూత్‌ను పరిశీలించగా ఇందులో ఉన్న ఇళ్ల నంబర్లన్నీ జీహెచ్‌ఎంసీ సీరియల్‌ నంబర్లకు భిన్నంగా ఉండడం గమనార్హం.

న్యాయ పోరాటం చేస్తున్నాం..  
నాంపల్లి నియోజవర్గం నుంచి 2009, 2014లో రెండు సార్లు పోటీ చేశాను. నాటి నుంచి నియోజకవర్గం ఓటర్‌ లిస్టును పరిశీలిస్తున్నా. 2009లో సుమారు 30 వేల బోగస్‌ ఓట్లు ఉన్నట్లు గుర్తించాం. ఈసారి మరీ పెరిగాయి. ఇంటి నంబర్లు లేని ఓట్లు, అపార్టమెంట్‌ పేరు లేని ఓట్లు, రెండు మూడు పోలింగ్‌ బూత్‌లలో ఒకే వ్యక్తి ఓట్లు, ఇతర నియోజకవర్గాల వ్యక్తుల ఓట్లు, జీహెచ్‌ఎంసీ వార్డు నంబర్‌ లేనివి ఇలా ఓటరు లిస్టులో నమోదు చేశారు. అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించాం. కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయం మావైపే ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా.– ఫెరోజ్‌ఖాన్, నాంపల్లి కాంగ్రెస్‌ నేత 

మరిన్ని వార్తలు