అరెస్టా..? విచారణా??

18 Jun, 2015 05:27 IST|Sakshi
అరెస్టా..? విచారణా??

ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ నోటీసులపై విస్తృత చర్చ
ఏమవుతుందోనని ‘దేశం’ శ్రేణుల్లో టెన్షన్
గతంలోనూ మద్యం కేసుల విషయంలో విచారణ
♦  మళ్లీ ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ ముందుకు..

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ విచారిస్తుందా..?  లేక విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందా..? అనే అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్సీ బరిలో నిలిచిన వేం నరేందర్‌రెడ్డిపై విచారణ కొనసాగుతుండటం.. ఇందులో సండ్రకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఏసీబీ భావిస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాజధానిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాసం ఉండే క్వార్టర్స్‌కు విచారణకు హాజరు కావాలని ఏసీబీ బృందం బుధవారం నోటీసులు అంటించింది. ఈనెల 19లోగా విచారణకు రావాలని ఈ నోటీస్‌లో ఏసీబీ పేర్కొంది. అయితే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో సండ్ర పాత్రపై కూడా ఏసీబీ పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం.

ఆయన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతో కూడా ఓటుకు నోటు విషయమై సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి సమాచారం ఉంది. దీనిలో భాగంగానే సండ్రను విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపింది. కాగా ఆయన విచారణలో వెల్లడించే విషయాలను అనుసరించి ఏసీబీ అరెస్ట్ చేస్తుందా..? కేవలం విచారణతోనే సరిపెడుతుందా? అనేదానిపై జిల్లాలో  జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఒకొక్కరికి ఏసీబీ ఒకవైపు నోటీసులు జారీ చేస్తూ.. మరోవైపు అరెస్ట్‌లతో కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

టీడీపీ శ్రేణుల్లో భయూందోళన
జిల్లాలోని టీడీపీ శ్రేణులు కూడా ఏ క్షణంలో ఏమవుతుందోనని భయాందోళనలో ఉన్నారుు. జిల్లాలో సార్వత్రిక పోరులో టీడీపీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది. అతనిపై కూడా ఏసీబీ ఉచ్చు బిగించడంతో జిల్లాలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. తుమ్మల టీడీపీని వీడటంతో ఆయన అనుచర ప్రజాప్రతినిధులు, శ్రేణులు చాలా వరకు గులాబీబాట పట్టాయి. తన ఓటమికి జిల్లాలో తన ప్రత్యర్థి పార్టీనే కంకణం కట్టుకోవడంపై ఆగ్రహంతో ఉన్న తుమ్మల టీడీపీని ఖాళీ చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.  నాయకులు పోయినా.. కేడర్ మాత్రం తమ వెంటే ఉందని పలుమార్లు  ప్రకటించిన టీడీపీ నేతలు తాజా పరిణామంతో కంగుతిన్నారు. సండ్రకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

ఏసీబీ ముందుకు రెండోసారి..
ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ నుంచి రెండోసారి నోటీసులు అందుకున్నారు. 2012 సెప్టెంబర్‌లో మద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన వరంగల్‌లో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అప్పట్లో పలు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యే హోదాలోనే ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి వస్తోంది. జిల్లా చరిత్రలోనే  ఓ ఎమ్మెల్యే ఏసీబీ ముందుకు పలు కేసుల నిమిత్తం విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి అని సమాచారం. ఏసీబీ సండ్ర విషయంలో ఎలా ముందుకెళ్తుందో..? ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని రాజకీయ పక్షాల్లో చర్చ సాగుతోంది.
 
ఈ రెండు రోజుల్లోనే ఏసీబీ ముందుకు సండ్ర ఎప్పుడు హాజరవుతారు.. ఆయన పాత్రపై ఏసీబీ ఏం తేలుస్తుంది.. ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉందని భావిస్తే వెంటనే ఏమైనా చర్యలకు దిగుతుందా? అనేది జిల్లాలో వాడీవేడిగా చర్చ సాగుతోంది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, శ్రేణులు సండ్రకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయంపై టెన్షన్‌కు గురవుతున్నారుు. ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు.
 
బిగుస్తున్న ఉచ్చు...
ఏసీబీ విచారణకు ఎమ్మెల్యే సండ్రను పిలవడంతో ఇందులో ప్రమేయం ఉన్న ఎమ్మెల్యేల మెడలకు కూడా ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల విచారణ అనంతరం ఓటు నోటుకు లొంగిన ఎమ్మెల్యేలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలకు ఏసీబీ తాకీదులు అందిస్తుందో వేచిచూడాల్సిందే. కొంతమంది జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏసీబీ దూకుడుతో బెంబేలెత్తిపోతున్నారు. తమపై ఏసీబీ ఎలా చర్యలకు ఉపక్రమిస్తుందోనని హైరానా పడుతున్నారు. టీడీపీ ఉచ్చులో చిక్కుకుని అనవసరంగా తమ రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నామని ఓ ఎమ్మెల్యే మథనపడుతున్నట్లు తెలిసింది.

ఓటుకు నోటులో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీ బరిలో నిలిచిన అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా కదిలిన సదరు ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఏసీబీ చర్యలను సాకుగా చూపించి వారి రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తేనే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగరని పార్టీలోని పెద్ద తలకాయలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు