కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి

24 May, 2019 12:57 IST|Sakshi

ఎమ్మెల్యేల అసమర్థతే కవిత ఓటమికి కారణం

మాపై తప్పుడు ఆరోపణలు చేయవద్దు

కవితకు మంచి భవిష్యత్‌ ఉంది: జీవన్‌రెడ్డి

సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నిజామాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కే కారణమని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్‌ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటుబ్యాంక్‌ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి పార్లమెంట్‌ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్‌ ఉందని అన్నారు. నిజామబాద్‌ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్‌ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు