ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యం!

6 Mar, 2015 01:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకింత  ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఈ నెల 29వ తేదీతో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. కాగా, ఏపీ శాసన మండలిలో ఇదే గడువుతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. కానీ, తెలంగాణ మండలి ఎన్నికల అంశాన్ని పెండింగులో పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఎక్కువ రావడంతో ఇపుడు దానిని తగ్గించనున్నారు. అదే సమయంలో ఏపీ మండలికి అదనంగా ఒక స్థానాన్ని కేటాయించనున్నారు. వాస్తవానికి 14 ఎమ్మెల్సీ పదవులకు గాను, తెలంగాణకు 15 కేటాయించారు. ఇందులో ఏడు స్థానాలు ఈనెల 29న ఖాళీ అవుతున్నాయి. ఇపుడు ఒక స్థానం తగ్గించేందుకు కేంద్ర హోంశాఖలో ఫైలు పెండింగులో ఉందని, ఏ నిర్ణయం వెలువడలేదు కాబట్టి ఎన్నికల షెడ్యూలు విడుదల కాలేదని చెబుతున్నారు. స్థానిక సంస్థల కోటాలోనూ ఇదే సమస్య ఉన్నా, ఆ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దానికి గడువు ఉండడంతో ఇబ్బంది ఉండక పోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
 
 ‘ఎమ్మెల్సీ’పై దృష్టి పెట్టండి: కేసీఆర్
 
 ‘‘శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను తేలిగ్గా తీసుకోద్దు. వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టండి’’ అని మంత్రులకు సీఎం సూచించారు. కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ విజయంపై అనునామానాల్లేవన్న భావన వ్యక్తమైందని తెలిసింది. ‘‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయానికి కృషి చేయండి. ప్రచారంలో బాగా తిరగండి’’ అని సూచించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు