దేవాలయంలో ముష్కరులు..! 

9 May, 2018 09:47 IST|Sakshi

సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ఆక్టోపస్‌ సిబ్బంది మాక్‌ డ్రిల్‌ 

సాక్షి, రాంగోపాల్‌పేట్‌ : నిత్యం భక్తులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని లక్ష్మీగణపతి దేవాలయం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొంత మంది ముష్కరులు దేవాలయంలోకి ప్రవేశించారు.. దేవాలయంలో డిటోనేటర్లు, బాంబులు అమర్చారు.. కొందరు భక్తులు, ఆలయ సిబ్బందిని బంధించారు. దీన్నీ సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ చైర్మన్, ఈవోలు వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్‌ సిబ్బంది రంగంలోకి దిగారు.

చేతిలో అత్యాధునిక ఆయుధాలు, మాస్క్‌లు ధరించిన ఆక్టోపస్‌ సిబ్బంది రెండు గ్రూపులుగా విడిపోయి దేవాలయంలోకి ప్రవేశించి చాకచక్యంతో బంధీలను విడిపించారు. బాంబులను నిర్వీర్యం చేసి ముష్కరులను అంతమొందించారు.  ఇదంతా నిజం కాదు.. కానీ నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుంది. తీవ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఆక్టోపస్, గోపాలపురం పోలీసులు మాక్‌ డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పించారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు