మరోసారి మోదీ.. మరోసారి బీజేపీ: లక్ష్మణ్‌

13 Jan, 2019 04:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా మరోసారి మోదీ, మరోసారి బీజేపీ నినాదంలో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు శనివారం ముగిశాయి. దీనికి హాజరైన లక్ష్మణ్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో గత ఐదేళ్లపాటు అవినీతిరహిత పాలన అందించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.

గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని స్వాతంత్య్రం అనంతరం జరిగిన దేశ అభివృద్ధిని పోల్చి చూడమని ప్రజల్ని కోరతామన్నారు. ‘మేరా బూత్‌ మజ్బూత్‌’ పేరుతో బూత్‌ స్థాయిలో పార్టీని గెలిపించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఆ దిశగా సమావేశంలో ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రధాన సేవకుడిగా ఉన్న తనను ప్రజలు మళ్లీ దీవిస్తారన్న విశ్వాసంతో మోదీ ఉన్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి సాయం చేయట్లేదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు