బలహీనంగా రుతుపవనాలు

16 Jun, 2018 03:59 IST|Sakshi

 
సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే వారం రోజుల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలను కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు విదర్భ, తెలంగాణ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.

దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, ఖమ్మం, మెదక్‌లలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హన్మకొండ, హైదరాబాద్, మెదక్‌లలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.   

మరిన్ని వార్తలు