తెలంగాణలో కాంగ్రెస్‌కు దిక్కులేదు

28 Mar, 2019 02:47 IST|Sakshi

బీజేపీకి నాయకులు కరువయ్యారు 

ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. బీజేపీకి నాయకులే కరువయ్యా రు. ఇక ప్రజలకు వీరేం సేవచేస్తారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రజలు అడగకుండానే వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్నే ప్రజలు బలపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని బుధవారం సిద్ది పేట జిల్లా నంగునూరు, దౌలతాబాద్, గజ్వేల్‌ ప్రాం తాల్లో రోడ్‌షోలు, సభలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అందుకోసమే రైతులకు పెట్టుబడి సాయం అందించి దేశానికే ఆదర్శం గా నిలిచారని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ఇతర రాష్ట్రాల నాయకులు అభినందించారని, వారి రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు బండికి రెండు చక్రాల్లా ఉంటారని, ఇద్దరి సమన్వయంతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకోసమే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన నిలబడి ఓట్ల వర్షం కురిపించిన విధంగానే ఎంపీలను కూడా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. మెదక్‌ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీ ఇవ్వలేరని, వారి పోటీ నామమాత్రమే అని వారికి అర్థమైందని అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రభాకర్‌రెడ్డికి అత్యధిక మెజార్టీని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభాకర్‌రెడ్డి 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తారని, దేశంలో మరోసారి తెలంగాణ రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమాల్లో  కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు