మిడ్‌మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి

30 Sep, 2016 01:32 IST|Sakshi
మిడ్‌మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి

వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మంకమ్మతోట/బోయినపల్లి: కరీంనగర్‌లోని మిడ్‌మానేర్‌కు గండిపడి.. వరద ప్రవాహం తో  ఇసుక మేటలు పడిన పంట భూములకు  ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం  చెల్లించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మిడ్‌మానేర్ ప్రాజెక్టును సంద ర్శించి పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే, బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. మాన్వాడ వద్ద పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. నష్టపరిహారం అందేవరకు వైఎస్సార్ సీపీ  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిడ్‌మానేర్ ప్రాజెక్టు ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 12 ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కట్ట తెగడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం కనబడుతున్నా యన్నారు. స్పిల్‌వే కన్నా ఎత్తులో మట్టి కట్ట నిర్మించాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మిం చడం తోనే నీటి ఉధృతికి కట్ట తెగిందన్నారు.  

మిడ్‌మానేర్‌ను సందర్శించిన వారిలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్ ముజారుద్దీన్, బోయినపల్లి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు అక్కెనపెల్లి కుమార్, బమ్మిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాడెం శాంతకుమార్, అమృతసాగర్, వెల్లాల రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు