కొలిక్కిరాని ముస్తఫా హత్య కేసు

12 Oct, 2014 04:42 IST|Sakshi
 • ఘటనా స్థలంలో లభించిన అగ్గిపెట్టె, చాక్లెట్లు
 • వీటిని ఖరీదు చేసిన వ్యక్తి గురించి ఆరా
 • ఫొరెన్సిక్ ల్యాబ్‌కు కిరోసిన్
 • సాక్షి, సిటీబ్యూరో: మెహదీపట్నం మిలటరీ ఏరియాలో హత్యకు గురైన ముస్తఫా (11) కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కిరాలేదు. దర్యాప్తునకు కావాల్సిన వస్తువులు కొన్ని పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగానే దర్యాప్తును సాగిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదిస్తామని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తుకు సైనికాధికారులు కూడా పూర్తి గా సహకరిస్తున్నారిని ఆయన తెలిపారు.  ఈ నెల 8న ముస్తఫా కాలిన గాయాలకు గురై, మరుసటి రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఘటనా స్థలాన్ని మిలటరీ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులే కేసు పురోగతికి కీలకం కానున్నాయి.
   
  సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాలోనే...

  మెహదీపట్నం మిలటరీ ఏరియాలో మిలటరీ సిగ్నల్ వ్యవస్థ పరికరాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఐదు గదులు దూరం దూరంగా కట్టి ఉన్నాయి. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ గదుల  చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో పహరీ గోడలు, ఆపై నాలుగడుగుల ఇనుప సీకులతో కంచె ఉంది. లోపల ఓ మూలన వేరుగా బాత్‌రూమ్, వీటి పక్కనే మరో ధోబీ రూమ్ ఉన్నాయి. ఆ గదులలో మిలటరీ సిబ్బందికి సంబంధించిన సామాగ్రి  భద్రపరుస్తారు. పది అడుగులతో ప్రధాన గేటు, దానికి ఆనుకుని మూడడుగుల వెడల్పుతో మరో చిన్నగేటు ఉంది. గేటు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. గేటు కింది నుంచి ఎవరైనా లోపలికి దూరే అవకాశం ఉంది.
   
  బాత్‌రూమ్ వద్దే మంటలు..

  బాత్‌రూమ్ గోడకు అనుకుని ఉన్న సమయంలోనే ముస్తఫా ఒంటిపై కిరోసిన్ పడింది. అక్కడ ఉన్న చిన్న నీటి గుంటలో కిరోసిన్ పడిన దాఖలాలు ఉన్నాయి. ముస్తఫా చెప్పులు కూడా అక్కడే పడి ఉన్నాయి. బాత్‌రూమ్‌కు ఐదడుగుల దూరంలో పుల్లల  డబ్బి లభించింది. మూడడుగుల దూరంలో చాక్‌లెట్ కవర్ కూడా లభించింది. పదడుగుల దూరంలో విసిరేసినట్లుగా అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ఇందులో ఐదు మిల్లిలీటర్ల కిరోసిన్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. బాత్‌రూమ్ వద్దే ముస్తఫాకు నిప్పంటుకుంది.
   
  50 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి...


  కాలుతున్న మంటల్లోనే ముస్తఫా అక్కడి   నుంచి 40 మీటర్ల దూరం వరకు ఉన్న ప్రధాన గేటు వరకు వచ్చాడు. చిన్నపెద్దగేటు రెండు కూడా తాళాలు ఉండడంతో గేటు కింది నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చి మరో 10 మీటర్ల దూరం వరకు (సిద్దిఖీనగర్ వైపు) వెళ్లి తారు రోడ్డుపై పహరీ గోడకు మూడు అడుగులో దూరంలో కుప్పకూలిపోయాడు. మరో 30 మీటర్ల దూరం వెళితే సిద్దిఖీనగర్ బస్తీకి వేసిన మిలటరీ కంచె దాటే అవకాశం ఉంది.
   
  ఇవే కీలక ఆధారాలు...

  ఘటనా స్థలంలో లభించిన పుల్లల డబ్బి (జోకర్ కంపెనీ), చాక్లెట్ కవర్ (కోజ్‌కో కంపెనీ)లు  సిద్దిఖీనగర్‌లోని ఓ చిన్నపాటి కిరాణా షాప్‌లోంచి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే పథకం ప్రకారమే అదే రోజు ఈ రెండు వస్తువులు షాప్‌లో ఖరీదు చేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే వాటిని ఎవరు ఖరీదు చేశారు అనే కోణంపై ఆరా తీస్తున్నారు. ముస్తఫా మంటల్లో కాలుతున్న సమయంలో అతడి ఒంటిపై 450 మిల్లీలీటర్ల కిరోసిన్ పడిందని. ఘటనా స్థలంలోని మురికి నీళ్లు, గడ్డిలో 45 మిల్లీలీటర్ల వరకు కిరోసిన్ పడిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. కేవలం బాటిల్‌లో ఐదు మిల్లీలీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలిఉంది. దూరంగా విసిరేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్‌కు మూత పెట్టలేదు, మూత మరో దిక్కున పడి ఉంది.  ఈ కిరోసిన్ షాంపిల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చింది. అనే విషయంపై ఆరా తీస్తున్నారు.కిరోసిన్ ఎక్కడిదనేది చెప్పగలిగితే కేసు మిస్టరీ వీడుతుందని అధికారులు అంటున్నారు.
   
  సమగ్ర విచారణ జరపాలి

  సాక్షి,సిటీబ్యూరో:  మదర్సా విద్యార్థి ముస్తఫా మృతిపై  సమగ్ర విచారణ జరిపించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మెనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్  శనివారం కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్, ఆర్మీ ప్రతినిధి అనుపమ శర్మ, పీర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు మాట్లాడారు.
   
  ముస్తఫాకు నివాళి..

  గోల్కొండ:  షేక్ ముస్తఫా హత్యపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ చైర్మన్ మహ్మద్ నజీబ్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం టోలీచౌకీలోని ఐహెచ్‌ఆర్‌ఓ కార్యాలయంలో షేక్ ముస్తఫా మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ ముస్తఫాది హత్యేనని ఆయన అన్నారు.  మిలటరీ జవాన్లే కిరోసిన్ పోసి నిప్పంటించారని షేక్ ముస్తఫా వాగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని అన్నారు. సయ్యద్ సుల్తానా, సమీర్, నాగిరెడ్డి, ముస్తఫా పాల్గొన్నారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా