నెక్లెస్ రోడ్డుకు కొత్త హంగులు

14 Sep, 2014 04:38 IST|Sakshi
నెక్లెస్ రోడ్డుకు కొత్త హంగులు
 • రూ.3.3కోట్లతో పునర్నిర్మాణం
 • రంగంలోకి దిగిన హెచ్‌ఎండీఏ అధికారులు
 • సాక్షి, సిటీబ్యూరో:హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డును ‘ఎక్స్‌ప్రెస్ వే’ తరహాలో తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ నెక్లెస్ రోడ్డుకు కొత్త హంగులు అద్దుతున్నారు. 133 కేవీ, 33 కేవీ విద్యుత్ కేబుల్‌ను నెక్లెస్ రోడ్‌లో భూగర్భనుంచి వేయాల్సి రావడంతో ఆ మార్గంలో తవ్వకాలు జరి పారు.

  దీంతో గతంలో వేసిన రోడ్డు ఛిద్రమైంది. అంతేగాక ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా దెబ్బతినడంతో వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు తవ్వకం వల్ల జరిగే నష్టాన్ని భరిం చేందుకు ట్రాన్స్‌కో, సీపీడీసీఎల్ ముందుకు వచ్చింది. రోడ్డు కటింగ్ చార్జెస్ కింద రూ.3.3 కోట్లు చెల్లించాయి.

  ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ  నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ రోటరీ నుంచి సంజీవయ్య పార్కు వరకు సుమారు 4.2 కిలోమీటర్ల మేర రోడ్‌ను పునర్నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు శుక్రవారం రాత్రి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 700 మీటర్ల మేర రోడ్డును నిర్మించామని, వాతావరణం అనుకూలిస్తే ఈనెల 25 నాటికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తామని ఎస్‌ఈ బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని ఇరు మార్గాల్లో ఓ వైపు  బీటీ వేస్తున్నామని, మరోవైపు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామన్నారు.

  ఈ మరమ్మతు పనులు కూడా మూడు దశల్లో చేపడుతున్నట్టు చెప్పారు. మొదట ఒక అడుగున్నర మేర పైపొరను తొలగించి చిప్స్ వేసి ఆ తర్వాత 20ఎంఎం మెటల్ అనంతరం డీబీసీ చేశాక బీటీ వేస్తూ రోడ్డును పటిష్టంగా నిర్మిస్తున్నామన్నారు. ప్రధానంగా విదేశీ పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకర్శిస్తున్న సాగర్‌ను వారికి మరింత చేరువ చేసేందుకు నెక్లెస్ రోడ్డును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
   
  కూకట్‌పల్లి నాలా శుద్ధి

  హుస్సేన్‌సాగర్ నీటిని శుద్ధి చేయడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కూకట్‌పల్లి నాలా ముఖద్వారం వద్ద (హుస్సేన్ సాగర్‌లో కలిసే చోట) పెద్దమొత్తంలో పూడికను తొలగించే పనులు ప్రారంభించారు.
   
  ప్రధానంగా బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి భారీ విషరసాయన వ్యర్థాలను మోసుకు వస్తోన్న కూకట్‌పల్లి నాలా వాటిని నేరుగా సాగర్‌లో కలిపేస్తోంది. దీంతో నాలా ముఖద్వారం వద్ద సుమారు 500 చదరపు మీటర్ల మేర వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రత్యేక యంత్రాన్ని వినియోగించి ఆ వ్యర్థాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు