వాహన కాలుష్యానికి.. ఆన్‌లైన్‌ తనిఖీలు 

28 May, 2019 01:51 IST|Sakshi

మాన్యువల్‌ తనిఖీలకు త్వరలో స్వస్తి 

ఆర్టీఏ కేంద్ర కార్యాలయం నుంచే ప్రమాణాల నిర్ధారణ 

‘స్మార్ట్‌చిప్‌’సంస్థతో సాంకేతిక సహకార ఒప్పందం 

త్వరలో అమల్లోకి రానున్న నూతన విధానం 

సాక్షి, హైదరాబాద్‌ : వాహన కాలుష్యానికి ఆన్‌లైన్‌ తనిఖీలతో కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు మనుషుల ద్వారా నిర్వహించే కాలుష్య తనిఖీ పరీక్షలను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు.కేంద్రమోటారు వాహన చట్టంలో రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తారు. గ్రేటర్‌లో వాహన కాలుష్యం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పాత వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారక పదార్ధాలను వెదజల్లుతున్నాయి. వాటికి నిర్వహించే కాలుష్య తనిఖీల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదు. రోడ్లపై అక్కడక్కడా కనిపించే సంచార పరీక్షాకేంద్రాల్లో ఉత్తుత్తి తనిఖీలను నిర్వహించేస్తున్నారు. రూ.యాభయ్యో, రూ.వందో తీసుకొని కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు.

ఆర్టీఏ అధికారులు వాటినే ప్రామాణికంగా తీసుకొని వాహనాల సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నారు. దీంతో యథావిధిగా ఈ వాహనాలు భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం 55 లక్షల వాహనాలు ఉన్నాయి. బీఎస్‌ –4 ప్రమాణాల మేరకు ఉన్న కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలు మినహాయిస్తే బస్సులు, ఆటోలు, లారీలు, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల్లో లక్షల కొద్దీ పాత వాహనాలే ఉన్నాయి. బీఎస్‌–2, బీఎస్‌–3 వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్‌డయాక్సైడ్, లెడ్‌ వంటివి పెద్ద మొత్తంలో విడుదలవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న మాన్యువల్‌ పద్ధతిలో సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. పైగా కాలుష్య తనిఖీ నియంత్రణ స్టేషన్‌లపైన ఎలాంటి నిఘా లేకపోవడం వల్ల 80 శాతం ఉత్తుత్తి తనిఖీలతోనే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి.  

‘స్మార్ట్‌చిప్‌’తో ఒప్పందం... 
కాలుష్యనియంత్రణపైన రవాణా అధికారులు కొంత కాలంగా తీవ్రంగా దృష్టిసారించారు. ఇప్పుడు ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చివేసి మనుషులతో ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లోనే వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించాలనే ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా సాంకేతిక సంస్థల నుంచి గతేడాది టెండర్లను ఆహ్వానించారు.పలు సాంకేతిక సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్‌చిప్‌’సంస్థను ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు రవాణాశాఖ ఐటీ విభాగం సంయుక్త రవాణా కమిషనర్‌ రమేష్‌ ‘సాక్షి’ కి చెప్పారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాలుష్య కారకాలను గుర్తించి సర్టిఫికెట్‌లను అందజేయడంలో తమకు ఈ సంస్థ సాంకేతిక సాయం అందజేస్తుందన్నారు.

నగరంలోని సుమారు 350 కి పైగా ఉన్న కాలుష్య తనిఖీ వాహనాలను, కేంద్రాలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తేనున్నామన్నారు. రహదారులపై వాహనాలకు కాలుష్య పరీక్షలు నిర్వహించినప్పుడు వాటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఆన్‌లైన్‌లో నిర్ధారించి సర్టి ఫికెట్‌లను అందజేస్తారు. తనిఖీ కేంద్రాల్లోని ప్రింటర్‌ల ద్వారా ఈ సర్టిఫికెట్‌లు వాహనదారుడికి చేరుతాయి. ఎక్కడా మనుషుల ప్రమేయానికి తావు ఉండదు. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న తనిఖీ కేంద్రాలను కూడా పెంచుతారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందేవిధంగా పర్యవేక్షిస్తారు.  

పాత పద్ధతికి స్వస్తి..
కేంద్రమోటారు వాహనచట్టం 1988 ప్రకారం కాలుష్య నియంత్రణకు 2002లో తనిఖీ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని పెట్రోల్‌ బంకులలో ఏర్పాటు చేసిన స్థిరమైన కేంద్రాలు. కాగా. మరికొన్ని సంచార టెస్టింగ్‌ స్టేషన్‌లు. ఈ కేంద్రాల్లో గ్యాస్‌ అనలైజర్లు, స్మోక్‌ మీటర్లు ఉంటాయి. వాటి సాయంతో వాహనం నుంచి వెలువడే పొగసాంద్రత, దానిలోని కాలుష్య కారక పదార్ధాలను నిర్ధారిస్తారు. కానీ కొన్ని స్టేషన్‌లలో అనలైజర్లు, స్మోక్‌మీటర్లు పని చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి తనిఖీలతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు, రవాణా అధికారులు ఈ స్టేషన్‌ల పై ఎలాంటి తనిఖీలు నిర్వహించపోవడం, చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల అవి యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. వీటికి ఇక కళ్లెం పడనుంది. 

మరిన్ని వార్తలు