సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

23 Jul, 2019 10:57 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

వివాహమైన నెలకే ఘోరం  

సాంబయ్యపల్లిలో విషాదం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): అతడో కూలీ.. రోజూవారీగా కష్టం చేస్తే.. వచ్చే ఆదాయంతో కుటుంబం గడుస్తుంది. ఆదివారం కావడంతో తోటి స్నేహితుల వ్యవసాయ పనులకు సాయంగా వెళ్లాడు.వ్యవసాయ మోటారు ఫ్యూజు తీసేప్పుడు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సాంబయ్యపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన కూకట్ల మల్లయ్య కొడుకు శ్రీకాంత్‌(21). కరీంనగర్‌ శనివారం మార్కెట్లో  టార్స్‌పోర్టు హమాలీగా పనిచేస్తుంటాడు. నెలన్నర క్రితమే కేశవపట్నం మండలం గద్దపాకకు చెందిన శ్రుతితో వివాహం జరిగింది.

ఆదివారం సెలవు దినం కావడంతో తోటి స్నేహితులు, సమీప బంధువుల అయిన ఆసరి శ్రీనివాస్, టి.కొమురయ్య కౌలు చేస్తున్న భూమిలో వ్యవసాయపనులు చేయడానికి శ్రీకాంత్‌ను వెంటతీసుకెళ్లారు. వ్యవసాయ బావిలో నీరు అయిపోతుండడంతో విద్యుత్‌ మోటారును బంద్‌ చేయాలని శ్రీకాంత్‌కు సూచించారు. ఆయన వెళ్లి ఫ్యూజ్‌ తీసేక్రమంలో కరెంట్‌షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన భార్య, కుటుంబసభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు. మృతదేహాన్ని సుల్తానాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీకాంత్‌ తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు.  

మరిన్ని వార్తలు