గుళ్లకు కొత్త ‘చట్టం’

19 Jun, 2015 02:17 IST|Sakshi
గుళ్లకు కొత్త ‘చట్టం’

పనికిరాని నిబంధనలకు రాంరాం
సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్తంగా ఉన్న దేవాదాయ శాఖను  చక్కదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేవాదాయశాఖ విశ్రాంత సంయుక్త కమిషనర్ ఎల్.వెంకటాచారి, దేవాదాయశాఖ విశ్రాంత ఉప కమిషనర్ కె.సీతారామారావు, న్యాయవాది ఎ.కృష్ణమూర్తి సభ్యులుగా.. వరంగల్ ఉప కమిషనర్ రమేశ్‌బాబు కన్వీనర్‌గా ఇటీవల ఏర్పాటైన కమిటీ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు అంశాల్లో స్పష్టమైన సిఫారసులు చేయాలని సూచించగా వాటి కి సంబంధించి దేవాలయాల నిర్వాహకులు, అధికారులు, అర్చకులతో సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు తీసుకుంటోంది.
 
 తెలంగాణ పరిస్థితులకు వీలుగా దేవాదాయశాఖ చట్టానికి సవరణలు చేయడం, అంతగా ఉపయోగం లేని నిబంధనలను తొలగించి వాటిస్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం ఇందులో కీలకమైంది. ఇక ఆలయాల నిర్వహణను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు విధివిధానాలు రూపొందించడం, అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని లీజుల రూపంలో ఆలయానికి ఆదాయాన్ని పెంచాలంటే తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫారసులు సిద్ధం చేస్తోంది. దేవాలయాల్లో ఖాళీల భర్తీకి అనుసరించాల్సిన విధానాలను కూడా ఇందులో చేర్చబోతోంది.  
 

>
మరిన్ని వార్తలు