కొత్త కార్డులు రానున్నాయ్..

7 Oct, 2014 01:02 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన అర్హుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు పది నెలలుగా కొత్త రేషన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఆశావహులు కేసీఆర్ వ్యాఖ్యలు తొందరగా ఆచరణ రూపంలోకి రావాలని ఆశిస్తున్నారు.

ఉమ్మడి రాష్ర్టంలో గతేడాది డిసెంబరులో రచ్చబండ 3 నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున రేషన్‌కార్డుల కోసం అర్హులు దరఖాస్తులు అందజేశారు. అయితే.. రాష్ట్ర విభజన, ఆ తర్వాత ఎన్నికలు రావడం, కొత్తగా ఏర్పడిన సర్కారు అవకతవకలను సరిదిద్దిన తర్వాతే కొత్త కార్డులు మంజూరు చేస్తామనే ప్రకటనతో అర్హులకు కార్డులు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. తెలంగాణ సర్కారు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’, ‘మనవార్డు-మన ప్రణాళిక’లో సైతం కార్డుల కోసం విన్నవించుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది.

 ప్రజల క్షేత్రస్థాయి అవసరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయని, వారిలో అర్హులు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని వివరాలు తేటతెల్లం చేశాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కొత్త రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద ఎత్తున ఉన్న అర్హులకు ఊరట కలిగించింది.

 లెక్క తేలుస్తున్నారు..
 జిల్లాలో అన్నిరకాల కార్డులు కలిపి ప్రస్తుతం 6,35,895 రేషన్‌కార్డులున్నాయి. బోగస్ కార్డుల తొలగింపునకు ముందు రేషన్‌కార్డుల సంఖ్య 7,05,073. ఆధార్ అనుసంధానం, బోగస్‌ల ఏరివేతతో 69,178 కార్డులు తొలగించారు. అయితే.. ఆధార్‌కార్డులు సమర్పించడంతో తొలిగించిన వాటిలోని 18,000 కార్డులకు తిరిగి మోక్షం కలిగించారు.

ఇదిలా ఉంటే సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కతేల్చిన ప్రకారం జిల్లాలో 7,72,679 కుటుంబాలు ఉన్నాయి. సభ్యుల సంఖ్య 25,94,757గా నమోదయ్యింది. ఈ లెక్కన పెద్ద ఎత్తున కార్డుల జారీ అవసరం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా అందుబాటులో ఉన్న డాటా, సమగ్రసర్వేలో తేలిన వివరాల ఆధారంగా కొత్త కార్డుల జారీ, ప్రస్తుత కార్డుల కొనసాగింపు కసరత్తును అధికారులు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు