కొత్త కార్డులెప్పుడో!

12 Jan, 2019 08:24 IST|Sakshi

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): పేదలు రేషన్‌ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేయడం లేదు. రేషన్‌కార్డుల కోసం అర్హులు మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ చేసుకొని నెలలు గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో ప్రతీనెల రేషన్‌ షాపుల నుంచి బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు ప్రతీ నెల మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టి ఆహారభద్రత కార్డు జిరాక్స్‌ తీసుకువస్తేనే రేషన్‌ డీలర్లు సరుకులు ఇస్తున్నారు. 

జిల్లాలో 365 రేషన్‌ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బీపీఎల్‌ కార్డులు 1,85,255 ఎఫ్‌ఎస్‌సీ కార్డులు 1,72,065 ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 12,914 ఏఏపీ కార్డులు 570 కార్డులు ఉన్నాయి. రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ విధానం అమలు చేయగా ప్రతీ లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు ఉంటేనే దానిపై ఉన్న నంబర్‌ను ఈ–పాస్‌ మిషన్‌లో ఎంటర్‌ చేసి సదురు లబ్ధిదారుడి వేలిముద్ర వేస్తే గాని సరుకులు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం గతంలో కొంతమందికి తాత్కాలికంగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసినా పూర్తిస్థాయిలో కార్డులు ఇవ్వకపోవడంతో ప్రతీ నెల లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డుల జిరాక్స్‌ కాఫీలను తీసుకొచ్చి షాపుల్లో సరకులు తీసుకోనే దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.

11,027 దరఖాస్తులు 
జిల్లాలో మొత్తం 365 రేషన్‌షాపుల పరిధిలో నూతన కార్డులు కోసం మీసేవ కేంద్రాల్లో 11,027 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ వద్ద 3,226, తహశీల్దార్‌ కార్యాలయాల్లో 290, డీఎస్‌వో కార్యాలయంలో 544 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులను జారీ చేయకపోవడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు తహశీల్‌ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. నూతన రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

అర్హులందరికీ అందిస్తాం 
ఆహారభద్రత కార్డుల జారీ కోసం లబ్ధిదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆ¯న్‌లైన్‌ ఆప్‌లోడ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కార్డుల జారీ చేస్తే తప్పనిసరిగా అర్హులందరికీ జారీ చేస్తాం.  
– సుదర్శనం, డీఎస్‌వో ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు