పకడ్బందీగా ఇసుక పాలసీ అమలు

11 Apr, 2015 01:29 IST|Sakshi

గనుల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని పకడ్బందీగా, అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను గనుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖకు విధించిన రూ. 3,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గనుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా గత ఏడాది 90 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగామని అధికారులు మంత్రికి వివరించారు.

పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి సంబంధించి ఇప్పటికి 120 కేసుల్లో ఎన్‌వోసీలను జారీ చేశామని, పెండింగ్ కేసులను వచ్చే 3 నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. సీనరేజి చార్జీల సవరణ విషయంలో కమిటీని నియమించి చార్జీలు నిర్ణయించాలని, గ్రానైట్ క్వారీయింగ్‌లో స్లాబ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో పెట్టిన విజిలెన్స్ కేసులను ఒకేసారి పరిష్కరించుకోవడానికి వీలు కల్పించాలని, బిల్డర్స్ చార్జీల కింద చదరపు అడుగుకు రూ.3 వసూలు చేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఉత్తర్వుల జారీకి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి కొత్త నిబంధనలను రూపొందించాలని కూడా మంత్రి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు