పీవీ వర్ధంతికి నివాళులు.. తెలంగాణకు లంకె బిందెగా అభివర్ణించిన సీఎం రేవంత్‌రెడ్డి

23 Dec, 2023 11:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సం‍దర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని అన్నారు.

ఇక ఢిల్లీ పర్యటలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా  పాల్గొన్నారు. 

భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ ఉంచింది.

>
మరిన్ని వార్తలు