ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

14 Jun, 2017 17:30 IST|Sakshi
ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

హైదరాబాద్‌ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్‌ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్‌ఐ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే.

​కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్‌ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్‌, అతని స్నేహితుడు శ్రావణ్‌ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ముగ్గురికి వివాదాలు ఉన్నాయని, వీరి మధ్య మంగళవారం తెల్లవారుజామున రెండున్నర వరకూ పంచాయితీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌ను ప్రశ్నించగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే  చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పినట్లు సమాచారం. రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.