కొత్త కొత్తగా.. జోనల్‌ వ్యవస్థ

8 Oct, 2017 02:43 IST|Sakshi

కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు: సీఎం కేసీఆర్‌

రెండు జోన్ల స్థానంలో మరిన్ని జోన్లు ఏర్పాటు

అధ్యయనానికి మంత్రులు, అధికారులతో కమిటీ

కొత్తగా జిల్లా, జోన్, మల్టీ జోన్, రాష్ట్ర స్థాయి పోస్టులు

రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రతిపాదిస్తాం

కొత్త ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ

నియామకాలు, ‘జోనల్‌’, రాష్ట్రపతి ఉత్తర్వులపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా జోన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని.. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల (371డీ)ను సవరించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కోసం కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. దీనిపై తానే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, వీలైనంత త్వరగా కొత్త ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్‌ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఏ జోన్‌లోకి ఏ జిల్లా..?
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, దీనికి అనుగుణంగా కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో స్థానికులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జోనల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక పరిస్థితులు మారాయి. కొత్తగా 21 జిల్లాల రాకతో రాష్ట్ర స్వరూపం మారింది. పాత జోనల్‌ విధానం అమలు ఇప్పుడు అసాధ్యం. కాబట్టి కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచుకోవాలి. ఏ జిల్లాలు (కొత్తవి) ఏ జోన్‌లో వస్తాయో నిర్ధారించాలి. ఇందుకోసం మంత్రులు, అధికారులతో కమిటీ వేస్తున్నాం. వారు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేస్తుంది. ఈ మేరకు కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదిస్తాం. నేనే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖతో మాట్లాడుతా. వీలైనంత త్వరగా కొత్త ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తా..’’అని చెప్పారు.

పోస్టుల కేడర్లపైనా పరిశీలన
ఇక జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్‌ పోస్టులను నిర్ధారించాల్సి ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఏ పోస్టు ఏ కేడర్‌ కు చెందుతుంది, జోన్లు ఎన్ని ఉండాలి, ఏ జోన్‌ పరిధిలో ఏ జిల్లాలుండాలి, నాలుగు కేడర్ల పోస్టులను ఎలా విభజించాలన్న అంశాలపైనా మంత్రులు, అధికారులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, సీనియర్‌ అధికారులు ఎస్‌కే జోషి, సురేష్‌ చంద్ర, అజయ్‌ మిశ్రా, బీఆర్‌ మీనా, రాజీవ్‌ రంజన్‌ ఆచార్య, అదర్‌ సిన్హా, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు కమిటీలో ఉంటారని తెలిపారు.

అన్ని నియామకాల్లో కచ్చితత్వం
ఉమ్మడి ఏపీలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, పోస్టింగుల్లో తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగిందని.. అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకుండా దొడ్డి దారులు వెతికారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాకుండా కొత్త వ్యవస్థలు సృష్టించారు. వారికి అనుకూలంగా నియామకాలు, పదోన్నతులు, పోస్టింగులు ఇచ్చుకున్నారు. ఇప్పుడలా జరగడానికి వీల్లేదు. ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ నియామకం కచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉండాలి. విద్యుత్, సింగరేణి, ఆర్టీసీలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా వాటి పరిధిలోకి రావాలి.

ఏ కేడర్‌ కింద ఏ పోస్టు ఉందో కూడా ముందే స్పష్టంగా తెలియాలి. పదోన్నతుల విషయంలో స్పష్టత రావాలి. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాలి. ఏ పోస్టు ఏ కేడర్‌ కిందికి వస్తుంది, జోనల్‌ వ్యవస్థ ఎలా ఉండాలి, మల్టీ జోనల్, స్టేట్‌ లెవల్‌ పోస్టులను ఎలా నిర్ధారించాలన్న అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించాలి. అన్ని శాఖల కార్యదర్శులతో, కలెక్టర్లు, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. కొత్త ఉత్తర్వుల కోసం ఉన్నతమైన విధానాన్ని ప్రతిపాదించాలి. రాష్ట్రపతి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలి..’’అని కేసీఆర్‌ సూచించారు.

‘స్థానికత’కు చదువొక్కటే ప్రామాణికం కాదు
స్థానికతను నిర్ధారించే విషయంలో శాస్త్రీయమైన పద్ధతి కావాలని.. కేవలం ఎక్కడ చదువుకున్నారనే అంశమే స్థానికతకు ప్రామాణికం కావడంతో సమస్యలు వస్తున్నాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దానివల్ల కొంతమంది స్థానికులు నష్టపోవాల్సి వస్తోందని, ఈ విషయంలో కూడా మార్పులు అవసరమని చెప్పారు. ఈ అంశాలను కూడా కమిటీ లోతుగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. స్థానికతకు కొత్త విధానానికి రూపకల్పన చేయాలని, వివాదాలకు తావులేని విధంగా భవిష్యత్‌ తెలంగాణకు బాట చూపేలా ఉండాలని సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం, నాయిని, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు కేడర్లకే సానుకూలం
సమీక్ష సందర్భంగా పలు అంశాలపై మంత్రులు, అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జోనల్‌ వ్యవస్థను కొనసాగించాలా, లేక దానికి స్వస్తి పలికి కేవలం జిల్లా, రాష్ట్ర కేడర్లను మాత్రమే ఉంచాలా? అన్న అంశాల్లో జోనల్‌ వ్యవస్థ కొనసాగింపునకే మంత్రులు, అధికారులు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం జిల్లా, స్టేట్‌ కేడర్‌ మాత్రమే ఉంటే.. ప్రయోజనాలకన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు, ఉద్యోగార్థులకు అనువుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్‌ కేడర్‌ పోస్టులు ఉండాలని సూచించారు. అడ్వొకేట్‌ జనరల్, లా సెక్రెటరీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో.. నాలుగు కేడర్ల పోస్టులు కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. దీంతో కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు పొందాలని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి సూచించారు.

‘జిల్లా’ పోస్టులకు కొత్త జిల్లాలే..
జిల్లా కేడర్‌ పోస్టులను కొత్త జిల్లాల ప్రాతిపదికనే నియమించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందే స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనని.. కాబట్టి కచ్చితంగా కొత్త జిల్లాల ప్రాతిపదికనే జిల్లా కేడర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా కొత్త జిల్లాల వారీగానే జారీ చేయాలన్నారు.

వెంటనే బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ
అన్ని శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ఆయా వర్గాల్లో అర్హులైన అభ్యర్థులున్నా కూడా బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉండడం అన్యాయమని పేర్కొన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ దీనిపై ప్రతీ నెలా చివరి రోజున సమీక్ష నిర్వహించాలని.. బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటవెంటనే భర్తీ చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు