పట్టాలెక్కని పల్లె ప్రగతి

1 Jan, 2018 14:31 IST|Sakshi

నిధులున్నా ఖర్చుచేయని వైనం.. మూడేళ్లుగా ప్రచారానికే పరిమితం

పల్లె ప్రగతి పథకం కింద ప్రభుత్వం కొన్ని ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనుకబడిన మండలాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎక్కువ నిరక్షరాస్యత, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ప్రసవాల శాతం.. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు,  పౌష్టికాహారం సరిగా అందని ప్రాంతాలను గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేశారు. 

జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు:
ప్రపంచ  బ్యాంకు సహకారంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి పథకం (తెలంగాణ రూరల్‌ ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌ ప్రాజెక్ట్‌ –టీఆర్‌ఐజీపీ) పట్టాలెక్కడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్న పురోగతి కన్పించడం లేదు. కోట్ల రూపాయలు కేటాయించినా ఇప్పటివరకు ఖర్చు చేయని దుస్థితి కన్పిస్తోంది.  

ఉపాధి కల్పనే ప్రధానాంశం..
పల్లె ప్రగతి కింద గుర్తించిన గ్రామాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. గ్రామీణ ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆసక్తిని బట్టి ఉపాధి కల్పించాలి. గేదెలు, గొర్రెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, స్వయం ఉపాధి పొందడం కోసం ఏర్పాటు చేసుకునే కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాల్సి ఉంది. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు రుణాలు అందించడం ప్రత్యేక అంశం. 

కేటాయింపులు ఉన్నా..
రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా తెలంగాణ పల్లె ప్రగతి పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థికవృద్ధి రేటును పెంచడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

కొనసాగింది ఆరు నెలలే..
 హైదరాబాద్‌ మినహా నాటి తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని 150 అత్యంత వెనుకబడిన మండలాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టులో మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు. ఆరు నెలలపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఉన్నట్టుండి ఈ కార్యక్రమాల అమలును నిలుపుదల చేశారు.లక్ష్యం పెద్దదే.. అయినా..
రూ.653 కోట్ల వ్యయంతో 150 మండలాల్లోని సుమారు 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేపట్టిన ఈ పథకం అర్ధంతరంగానే ఆగిపోయింది. పల్లె ప్రగతితో తమ జీవితాలు మారిపోతాయని భావించిన వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం 

150  తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎంపికైన మండలాలు

రూ.653 కోట్లు స్వయం ఉపాధి కల్పనకు కేటాయించిన నిధులు..

రూ.203 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన నిధులు  

ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటుగా   పంట చేతికి  వచ్చిన తర్వాత మార్కెటింగ్‌ సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారు.
 

 ఈ పథకంలో మంచి అంశాలను చేర్చినా అమలులో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ,  మహిళలకు ఎంతో  ప్రయోజనకరంగా ఉన్నా ఏ కారణాల వల్ల నిలిపివేశారో తెలియడం లేదు. ఈ  పథకంపై ప్రభుత్వం ఏ  నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.  

                    

మరిన్ని వార్తలు