టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు లీడర్ల కరువు..!

22 Apr, 2018 10:41 IST|Sakshi

ఏడాదిన్నర క్రితం జిల్లా కమిటీని రద్దు చేసిన టీఆర్‌ఎస్‌

నియోజకవర్గ కమిటీల ఏర్పాటుప్రకటనలకే పరిమితం

కొత్త జిల్లా ఆవిర్భావం నుంచిపెండింగ్‌లోనే డీసీసీ

సమన్వయం, దిశానిర్దేశం చేసేవారు లేక కార్యకర్తలనిరుత్సాహం

సాక్షి, కొత్తగూడెం:  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ఓటర్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు సాధారణ ఎన్నికల వేడి కూడా క్రమంగా రగులుకుంటోంది. పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకుంటూ దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో సారథ్యాన్ని నియమించకపోవడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలకు తప్ప మిగిలిన అన్ని పార్టీలకు జిల్లా అధ్యక్షులు, కమిటీలను నియమించుకున్నాయి.

ఆయా పార్టీలు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నికల పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజాక్షేత్రంలోకి దూకి కార్యక్రమాలపై దృష్టిపెట్టాయి. శాసనసభ అభ్యర్థుల టికెట్ల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు మిగతా పక్షాలు వ్యూహరచన చేస్తుండగా, అధికార ప్రతిపక్షాల్లో సమన్వయపరిచేవారే కరువయ్యారు.  

టీఆర్‌ఎస్‌లో ఏవీ నియోజకవర్గ కమిటీలు?
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లా కమిటీలను రద్దు చేసి ఏడాదిన్నర గడిచింది. వాటి స్థానంలో నియోజకవర్గ కమిటీలు నియమిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నామినేటెడ్‌ పదవులు రాకపోయినా సంస్థాగత పదవులు వస్తాయని కేడర్‌ ఎదురుచూస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం కొత్తగూడెం శాసనసభా స్థానంలోనే టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. వలసలను భారీగా ప్రోత్సహించడంతో అన్ని పార్టీల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక నాయకులు ఇబ్బడిముబ్బడిగా టీఆర్‌ఎస్‌లో చేరారు.

జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు శాసనసభ సభ్యులు, వారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

దీంతో ఇక్కడ సమన్వయంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2017 అక్టోబరులో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ తెల్లం వెంకట్రావుకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడంతో పాటు అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి నియోజకవర్గాలకు డోర్నకల్‌కు చెందిన నూకల నరేష్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు.

ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మహబూబాబాద్‌కు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. కాగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో నియమించాల్సిన కమిటీలను ఇప్పటివరకు నియమించలేదు.

కాంగ్రెస్‌లో ఏడాదిన్నర నుంచి అదిగో.. ఇదిగో..  
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ నియామకం.. ఇదిగో.. అదిగో అంటూనే ఏడాదిన్నర గడిపింది. డీసీసీ నియామకం కొద్దిరోజుల్లోనే అంటూ జిల్లా ఆవిర్భావం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ నియామకం జరగలేదు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు ఎడవల్లి కృష్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు.

ఎవరికి వారు తమ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. 2017 మే నెలలో భద్రాద్రి డీసీసీ విషయమై ఏఐసీసీ నేతలు రామచంద్ర కుంతియా, దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, పీసీసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని, ప్రకటనే తరువాయి అని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. రానున్న సాధారణ, స్థానిక ఎన్నికలు, ఎత్తులు, పొత్తులు, ఎత్తులు, టికెట్ల వ్యవహారంపై కీలక నాయకులు దృష్టి సారించడంతో డీసీసీ అంశం మరింత వెనక్కు వెళ్లినట్లైంది.  

మరిన్ని వార్తలు