ధూపం దీపం శూన్యం!

5 Mar, 2015 01:47 IST|Sakshi
ధూపం దీపం శూన్యం!

దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధి దాదాపు ఖాళీ
పురాతన ఆలయ జీర్ణోద్ధరణను పణంగా పెట్టి పుష్కర పనులు
ధూప దీప నైవేద్య నిధులు ‘తెలంగాణ మొక్కుల’కు సరి
పేద ఆలయాలను కలవర    పెడుతున్న సర్కారు వైఖరి
ఇక దళిత వాడల్లో ఆలయాల నిర్మాణానికీ ఆటంకాలే
 
తెలంగాణలోని ప్రధాన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలన్న నిర్ణయంతో అభినందనలు అందుకుంటున్న ప్రభుత్వం.. పురాతన ఆలయాలు, ఆదాయం లేని చిన్న గుడుల విషయంలో వింతగా వ్యవహరిస్తోంది. ఇలాంటి దేవాలయాలకు ఆయువు పట్టయిన దేవాదాయ శాఖలోని సర్వశ్రేయో నిధిని అడ్డదారిలో కొల్లగొట్టేస్తోంది. కాసులు లేక నీరసంగా ఉండే ఆ నిధి కాస్తా సర్కారు దెబ్బతో ఖాళీ అవుతోంది. వీటిపైనే ఆధారపడ్డ వేల ఆలయాల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సర్వశ్రేయో నిధి పరిధిలోకి రాని పనులకు కూడా ఈ నిధులు దానం చేస్తూ చిన్న ఆలయాలను సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
 
 మొక్కులకూ ఇవే నిధులు
 తెలంగాణ సిద్ధిస్తే రెండు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలకు మొక్కులు మొక్కినట్టు  సీఎం స్వయంగా వెల్లడించారు. తిరుపతి వెంకన్నకు సాలిగ్రామ హారం, ఇంద్రకీలాద్రి కనకదుర్గ, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కొరివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించేందుకు రూ. 5.59 కోట్లు అవసరమవుతాయని లెక్కలేసి దాన్నీ  సర్వశ్రేయో నిధి ఖాతాలోకే వేసేసింది. పుష్కర పనులు, మొక్కులకు వెరసి రూ. 18.59 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సర్వశ్రేయోనిధిలో రూ. 28 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఖర్చు చేసిన మొత్తం తీసేస్తే మిగిలేది రూ. 9 కోట్లే.
 
 
 గాలిలో దీపంలా..
 దేవాలయాలకు అతి ముఖ్యమైన ధూప దీప నైవేద్యాలకు ప్రస్తుతం రూ.2,500 చొప్పున చెల్లిస్తున్న మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచుతున్నట్టు ఇటీవల సీఎం ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇందుకు రూ.13 కోట్లు కావాలి. జీర్ణోద్ధరణకు సంబంధించి పెండింగ్ బిల్లులే రూ.3 కోట్ల మేర పేరుకుపోయాయి. ఇక దళితవాడల్లో దేవాలయాలకు సంబంధించి రూ. 50 కోట్ల పనులు జరపాల్సి ఉంది. వీటన్నింటికి ఇప్పుడు నిధులెక్కడి నుంచి ఇస్తారో తెలి యని గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో దేవాలయాల ఆదాయం నుంచి కామన్ గుడ్ ఫండ్‌కు రూ.9 కోట్ల లోపు నిధులు మాత్రమే జమ కానున్నాయి. సాధారణంగా దీనికి ప్రభుత్వం నిధులిచ్చే ఆనవాయితీ లేదు.
 
 వెరసి అసలు పనులను పణంగా పెట్టి దాని నిధులను వేరే పనులకు ప్రభుత్వం మళ్లిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించాల్సిందిగా దేవాదాయ శాఖ ఆర్థికమంత్రికి ప్రతిపాదనలు అందజేసింది. వీటిని ఇస్తే సమస్యే ఉండదు. అయితే.. అన్ని నిధులు దేవాదాయ శాఖకు ఇచ్చే ఉదారతే ఉంటే.. అసలు సర్వశ్రేయో నిధిని మళ్లించే పరిస్థితి వచ్చేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే ధూప దీప నైవేద్యాలకు కొన్ని నిధులు మంజూరై అక్కడ పూజలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా ప్రభుత్వం మళ్లీ ‘పేద ఆలయాల’ను కలవరపెడుతోంది.
 
 ఇదీ సంగతి..
 దేవాదాయ శాఖలో సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్) పేరుతో ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆదాయం లేని గుడుల్లో ధూపదీప నైవేద్యాలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున సాయం చేయడం, శిథిల ఆలయాలను గుర్తించి బాగు చేయ టం, దళితవాడల్లో గుడుల నిర్మాణం దీని విధి. ఈ పరిధిలోకి రాని పనులకు నయా పైసా ఖర్చు చేయరాదు. కానీ ప్రభుత్వం దేవుడి పేరుతో జరిగే పనులనూ దీనికే అంటగడుతోంది. ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల సమస్య ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు ఖజానాపై అదనపు భారం లేకుండా చూసుకుంటోంది. ఖజానాను రక్షించుకునే క్రమంలో దేవుడి నిధికే ఎసరు పెట్టేసింది. ఈ ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు గోదావరి తీరంలో ఉండే ఆలయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం సొంతగా నిధులు ఇవ్వాల్సి ఉండగా.. అవి దేవుడి పనులే అయినందున దాన్నీ సర్వశ్రేయో నిధి ఖాతాలో జమ కట్టేసింది. అందుకోసం రూ.13 కోట్లను దాని నుంచే ఖర్చు చేయాలని నిర్ణయించింది.
 
 రాష్ట్రంలోని దేవాలయాల్లో దీపం మిణుకుమిణుకుమంటోంది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణను, ధూపదీప నైవేద్యాలను పణంగా పెట్టి పేద దేవాలయాల నిధులను సర్కారు దొడ్డిదారిన పుష్కరాల పనులకు మళ్లిస్తోంది. ఖజానాపై భారాన్ని వదిలించుకునేందుకు మొత్తంగా దేవుడి నిధికే ఎసరుపెట్టింది. దీంతో దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధి దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ పరిణామంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న పేద దేవాలయాలకు ఆసరా లేకుండా పోతోంది.              
 - సాక్షి, హైదరాబాద్

మరిన్ని వార్తలు