పాలు పోసినా దక్కని ‘పాడి పశువు’

4 Aug, 2018 01:41 IST|Sakshi

సబ్సిడీ గేదెలకు నోచుకోని ‘విజయ’ రైతులు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ ‘పాడి పశువు’కొంతమంది విజయ డెయిరీ రైతులకు దక్కడంలేదు. దశాబ్దాల తరబడి విజయ డైరీకి పాలు పోస్తున్న రైతుల్లో వేలాది మందికి ఈ పథకం వర్తించడంలేదు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 35 వేల మంది రైతులు సబ్సిడీ పాడి పశువులు పొందే అవకాశం కోల్పోయారు. మొత్తం లక్ష మంది రైతులు విజయ డెయిరీకి నిరంతరం పాల సేకరణలో చేదోడు వాదోడుగా ఉండగా వారిలో 65 వేల మందికి మాత్రమే సబ్సిడీ గేదెలు దక్కుతాయని అధికారులు తేల్చి చెప్పారు. 35 వేల మంది పాడి రైతుల్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం.

నాలుగు డెయిరీల్లోని 2.13 లక్షల రైతులకు లబ్ధి
తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. నాలుగైదు రోజుల్లో పలుచోట్ల గేదెలను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్‌ ధరగా నిర్ధారించారు. దానికి అదనంగా రూ. 5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం సర్కారు కేటాయించింది.

ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ. 60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతరలబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు సబ్సిడీపాడి పశువుల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే పలుచోట్ల పాడి రైతులు తమ వాటాధనాన్ని చెల్లించారు. అయితే, విజయ డెయిరీలోని రైతుల్లో దాదాపు 35 వేల మంది వరకు సబ్సిడీ పాడిపశువులను పొందే అవకాశాన్ని కోల్పోయారు.

‘ఈ–లాభ్‌’లో నమోదు కాకపోవడం వల్లే...
నాలుగు డెయిరీలకు చెందిన మొత్తం 2.13 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అందులో విజయ డెయిరీకి చెందిన పాడి రైతులు 65 వేలు అర్హులుగా నిర్ధారించింది. పశు సంవర్థక శాఖ ఏర్పాటు చేసిన ‘ఈ–లాభ్‌’పోర్టల్‌లో నమోదైన రైతులకే సబ్సిడీ పాడి పశువులు పొందేందుకు అర్హులని పేర్కొంది. ఇది విజయ డెయిరీలోని 35 వేల మంది రైతులకు శాపంగా మారింది. వాస్తవంగా విజయ డెయిరీకి గ్రామాల్లో పాల సొసైటీల ద్వారా పాలు వస్తాయి. ఆయా సొసైటీలకు రైతులు పాలు పోస్తుంటారు. అయితే, గత నవంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీ యాజమాన్యం ఇవ్వలేదు. దీంతో అనేకమంది రైతులు తాము పాలు పోయమంటూ తేల్చిచెప్పారు.

దీంతో జిల్లాల్లో ఉన్న పాల సొసైటీ యాజమాన్యాలు సొంతంగానే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇచ్చాయి. ఆ సమయంలోనే ఈ–లాభ్‌ పోర్టల్‌లో పాడి రైతుల సమాచారం నింపాలని, ఆ సమాచారం ఉంటేనే ప్రోత్సాహకం ఇస్తామని విజయ డెయిరీ యాజమాన్యం స్పష్టంచేసింది. అయితే అప్పటికే రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చిన స్థానిక పాల సొసైటీలు, తమ సొమ్ము వస్తుందో రాదోనని గమనించి కేవలం కొద్దిమంది రైతులే పాలు పోస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేశారు.

ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో 4 వేల మంది రైతులు పాలు పోస్తుంటే, ఈ–లాభ్‌లో మాత్రం 1,200 మంది పాడి రైతులే పాలు పోస్తున్నట్లు నమోదు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పాలు పోస్తుంటే, కేవలం 65 వేల మంది పేర్లనే నమోదు చేశారు. ఇదే కొంపముంచింది. ఈ–లాభ్‌లో ఉన్న రైతులనే సబ్సిడీ పాడి పశువుల పథకానికి ప్రమాణికం తీసుకోవడంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో 35 వేల మంది అర్హత కోల్పోయారు.

కొన్నిచోట్ల వేలాది మంది రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక సొమ్ము కూడా కోల్పోతుండటం పరాకాష్ట. పాడి రైతులకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇప్పుడు సబ్సిడీ బర్రెల పథకానికి నోచుకోవడం లేదు. దీన్ని పరిష్కరించడంలో పశు సంవర్థక శాఖ శ్రద్ధ చూపడంలేదు. వారందరూ అనర్హులంటూ భీష్మించుకు కూర్చుంది. ప్రైవేటు డెయిరీలు మాత్రం పాల పరిమాణానికి మించి రైతులను చేర్చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు