వంద నోటిఫికేషన్లు.. 30 వేల ఉద్యోగాలు

19 Dec, 2017 03:03 IST|Sakshi
టీఎస్‌పీఎస్సీ మూడో వార్షిక నివేదికను విడుదల చేస్తున్న కమిషన్‌ సభ్యులు రామ్మోహన్‌ రెడ్డి, మతీనుద్దీన్, సి.విఠల్, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, కార్యదర్శి వాణిప్రసాద్, సభ్యులు చంద్రావతి, సాయన్న

      టీఎస్‌పీఎస్సీ మూడో వార్షిక నివేదికలో వెల్లడి

     మూడేళ్లలో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు 

     వచ్చే నెలలో 8 వేలకుపైగా పోస్టుల ఫలితాల వెల్లడికి సన్నాహాలు

     జనవరి నుంచి మార్చి మధ్య మరిన్ని నోటిఫికేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మూడేళ్లలో 30 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో 6వేల వర కు పోస్టుల భర్తీ పూర్తికాగా, మిగతా నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3,878 ఉద్యోగాల భర్తీకి వచ్చే 3 నెలల్లో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మూడో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలు, భర్తీ చేయనున్న ఉద్యోగాలు, జారీ చేయనున్న నోటిఫికేషన్ల వివరాలను అందులో పొందుపరిచింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో  5,932 ఉద్యోగాలను భర్తీ చేయగా.. 23,953 ఉద్యోగాలు ఫలితాలు రావాల్సిన/ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఉన్నాయి. ఇందులో 8,657 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. వీటి ఫలితాలను జనవరిలో ప్రకటించనుంది. 3,226 పోస్టులకు సంబంధించి జవాబుల ‘కీ’లపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది. మిగతా పోస్టులకు సం బంధించి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. 

‘టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం’ 
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల సమగ్ర వివరాలను, ఫలితాలను ప్రకటించేందుకు, డిపార్ట్‌మెంటల్‌ టెస్టులకు హాజరయ్యే వారి ఫలితాలను ‘టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం’ వెబ్‌ జర్నల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సోమవారం దీనిని విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైందని, ఏపీపీఎస్సీలో ఉన్నంత మంది సిబ్బంది లేకపోయినా సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుని అత్యుత్తమంగా పనిచేస్తోందని నారాయణ పేర్కొన్నారు.   తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో 3 నెలలకోసారి టీఎస్‌పీఎస్సీ జర్నల్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. జర్నల్స్‌లో ఇచ్చే ఫలితాలు ప్రభుత్వ ఉత్తర్వులతో సమానంగా చెల్లుబాటు అవుతాయన్నారు. ఏపీపీఎస్సీ 2004 నుంచి 10 ఏళ్లలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. టీఎస్‌పీఎస్సీ మూడేళ్లలో 30 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టిం దని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సి.విఠల్‌ అన్నారు. ఇతర విభాగాలు మరో 20 వేల ఉద్యోగాలను భర్తీ చేశాయని.. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నా రు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు చంద్రా వతి, రామ్మోహన్‌రెడ్డి, మతీనుద్దీన్‌ ఖాద్రీ, సాయన్న, కమిషన్‌ కార్యదర్శి వాణిప్రసాద్‌ పాల్గొన్నారు. 

మూడు రోజుల్లో టీజీటీ ఫలితాలు 
గురుకులాల ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) ఫలితాలను మరో మూడు రోజుల్లోగా విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వెల్లడించారు. వారం రోజుల్లో పీజీటీ ఫలితాలను కూడా విడుదల చేస్తామన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 98 నోటిఫికేషన్లు జారీచేయగా... సోమవారం మహిళా శిశుసంక్షేమ శాఖలో 79 గ్రేడ్‌–1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌), వైద్య శాఖలో 200 గ్రేడ్‌–2 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. వీటితో మూడేళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్ల సంఖ్య 100కు చేరిందన్నారు. కోర్టు తీర్పు రాగానే గ్రూప్‌–2, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను ప్రకటిస్తామన్నారు.

పోస్టుల భర్తీ పరిస్థితి.. 
81 నోటిఫికేషన్ల ద్వారా నోటిఫై చేసిన పోస్టులు: 29,757 (గ్రూప్‌–1 పాత నోటిఫికేషన్‌ 128 పోస్టులు పోగా.) 
 పరీక్షలు పూర్తి/భర్తీ చేసిన ఉద్యోగాలు: 5,932 (1,032 పోస్టుల గ్రూప్‌–2 పరీక్షలు పూర్తి, కోర్టు కేసుతో పెండింగ్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌ 340) 
 ఫలితాలు రావాల్సినవి/ అండర్‌ ప్రాసెస్‌లో ఉన్నవి: 23,953 
 నోటిఫికేషన్లు జారీ చేయాల్సినవి:    3,878

మరిన్ని వార్తలు