గుడ్డు లేకుండానే ఫుడ్డు

22 Jun, 2018 10:41 IST|Sakshi
చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్లు లేకుండానే భోజనం వడ్డిస్తున్న దృశ్యం

కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ దుస్థితి  

కొత్తగూడెం : పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మెనూ ప్రకారం వారానికి మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు వడ్డించాలి. ఇటీవల కొత్తగూడెం నియోజకవర్గంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయప్రాత ఫౌండేషన్‌కు అప్పగించారు. గుడ్లు మాత్రం కాంట్రాక్టర్‌ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై 22 రోజులు గడిచినా ఒక్కసారి కూడా గుడ్డు వడ్డించలేదు.  

పాఠశాలల పునఃప్రారంభం నుంచి అందని గుడ్లు 

జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథంకంలో వారంలో మూడు రోజులపాటు గుడ్లను వండి పెట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని 1065 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 49,159 మంది విద్యార్థులు, 169 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 22,728 మంది, 139 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 15,584 మంది.. మొత్తం 87,471 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, అదనంగా గుడ్డుకు రూ. 4లు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ6.18కు అదనంగా గుడ్డుకు రూ. 4లు చొప్పున అదనంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లిస్తారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గుడ్డు ధరతో కలుపుకొని ఒక్కో విద్యార్థికి రూ. 8.18 పైసలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 

21,989 మంది విద్యార్థులకు అందని పౌష్టికాహారం 

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో ఆయా వంట ఏజెన్సీల ఆధ్వర్యంలోనే గుడ్లు కొనుగోలు చేసి విద్యార్థులకు అందచేస్తున్నారు. అక్షయపాత్ర సంస్థ సేవలను అందచేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం గుడ్లు అందటం లేదు.

కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, సుజాతనగర్‌ మండలాల పరిధి లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం 21,989 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. వీరందరికి పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లు వడ్డించడంలేదు. అక్షయపాత్ర ప్రారంభమైన అనంతరం గుడ్లను సరఫరా చేసేందుకు టెండర్‌ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించారు.

వీటిని ఉడికించి విద్యార్థులకు వడ్డించే బాధ్యత కుక్కర్‌ కం హెల్పర్‌లపై ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే వరకు ఇదే తంతు కొనసాగింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత గుడ్లు కొత్తగూడెం నియోజకవర్గంలోని ఏ పాఠశాలకూ చేరుకోలేదు. దీంతో ఇటు విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సదరుశాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

గుడ్లను అందించటం లేదు 

మా దగ్గర పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లను వండి పెట్టడం లేదు. వారం రోజులకు మూడు మార్లు పెట్టాలని మెనూలో మాత్రం ఉంది. ఎందుకో..మాకు అయితే అందటం లేదు.  
-పవన్‌కుమార్, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 
 

రెండు రోజుల్లో పరిష్కరిస్తాం  

గుడ్లు అందటం లేదని రెండు రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది. సరఫరాకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం నుంచి యథావిధిగా గుడ్లు అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.  -డి వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారిణి  
 

మరిన్ని వార్తలు