ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిన అధికారులు

6 Oct, 2019 08:02 IST|Sakshi
కార్మికుల సమ్మె కారణంగా ఖమ్మం డిపోలో నిలిచిపోయిన బస్సులు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి 

తొలిరోజు విధులకు హాజరైన ఉద్యోగులు నలుగురే.. 

పోలీసుల అదుపులో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు విజయవంతమైంది. జిల్లా లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల్లో పనిచేసే కార్మికుల్లో నలుగురు మినహా ఉద్యోగులు, కార్మికులు శనివారం పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. అయితే ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా.. దసరా, బతుకమ్మ పండుగలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసింది. పోలీస్‌ బందోబస్తుతో బస్సులను కొన్ని ప్రాంతాలకు తిప్పినా.. ప్రయాణికుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో నడపలేకపోయారు. ప్రైవేటు వాహనాలపై ఆధారపడి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభించారు. అయితే శనివారం ఉదయం సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

అనంతరం..ఆయా డిపోల పరిధిలోని హైర్‌ బస్సులను ఉదయం 10 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో నడిపించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు బస్సు డిపో ఎదుట ఉదయం ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కార్మిక సంఘాల సమ్మెకు సీపీఎం, సీపీఐ జిల్లా కమిటీలు సైతం మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీల జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు డిపో వద్ద జరిగిన కార్మికుల ఆందోళనలో పాల్గొని.. సమ్మెకు మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించగా.. నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావులతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని మూడు బస్సు డిపోల ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాన్ని చేపట్టడంతో అనేక మంది నిరుద్యోగులు ఆయా డిపోల ముందు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరీక్షించారు.

హైర్‌ బస్సులతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను సైతం నడిపించారు. శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరని పక్షంలో వారి ఉద్యోగాలు కోల్పోయినట్లవుతుందని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసినా.. జిల్లాలో కార్మికులు మాత్రం ఈ హెచ్చరికపై పెద్దగా స్పందించలేదు. మధిరలో ముçగ్గురు, సత్తుపల్లిలో ఒకరు మాత్రమే రెగ్యులర్‌ కార్మికులు విధులకు హాజరయ్యారు. మిగిలిన కార్మికులు తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపినా.. సమ్మె చేయడానికే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. జేఏసీ కన్వీనర్‌ కీసర శ్రీనివాసరెడ్డి, కోకన్వీనర్లు పాటి అప్పారావు, గడ్డం లింగమూర్తి, నాగేశ్వరరావు, గుం డు మాధవరావు, తోకల బాబు, రామారావు, శ్యాంసుందర్‌రావు, శ్రీనివాసరావు, వీరారెడ్డి, సుధాకర్, పద్మావతి, అనిత, మీరాబాయి, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
అధికారుల పర్యవేక్షణ.. 
ప్రభుత్వ హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో భారీ బందోబస్తు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి బస్సు డిపోలను కలెక్టర్‌ కర్ణన్‌ సందర్శించారు. ఆయా డిపోల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. బస్టాండ్‌ నుంచి బయలుదేరిన ప్రతి బస్సుకు పోలీస్‌ సిబ్బందిని రక్షణగా ఏర్పాటు చేసి.. రోడ్డుపైకి పంపారు. కాగా.. ఆర్టీసీ బస్సులు తిరిగిన మార్గాల్లో పోలీస్‌ వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహించారు. కాగా.. ఖమ్మం డివిజన్‌లో ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలకు సంబంధించిన 349 బస్సులు ప్రతిరోజు నడుస్తున్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందిన బస్సులు 163, అద్దె బస్సులు 186 ఉన్నాయి. సమ్మె కారణంగా శనివారం జిల్లాలో 221 బస్సుల్లో 113 ఆర్టీసీ, 108 హైర్‌ బస్సులు మాత్రమే భారీ బందోబస్తు నడుమ రోడ్డుపై తిరిగాయి.

బస్సులను నడిపేందుకు అవసరమైన తాత్కాలిక ప్రైవేటు డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల్లో చేపట్టారు. ఖమ్మం డిపోలో ఆర్టీఓ కృష్ణారెడ్డి ప్రైవేటు డ్రైవర్ల లైసెన్స్‌లను పరిశీలించి.. వారికి బస్సులను అప్పగించారు. సమ్మె తొలిరోజు బస్సులను నడిపేందుకు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు ఆసక్తి చూపినప్పటికీ.. ఖమ్మం డిపో పరిధిలో 29 మంది తాత్కాలిక ప్రైవేటు డ్రైవర్లను, 48 మంది తాత్కాలిక కండక్టర్లను, సత్తుపల్లి డిపోలో 29 మంది తాత్కాలిక ప్రైవేటు డ్రైవర్లను, 21 మంది తాత్కాలిక కండక్టర్లను, మధిర డిపోలో 15 మంది తాత్కాలిక ప్రైవేటు డ్రైవర్లను, 10 మంది తాత్కాలిక కండక్టర్ల సాయంతో బస్సులను నడిపారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.. 
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లాలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేశాం. తొలిరోజు 65 శాతం బస్సులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నడిచాయి. 175 మంది ప్రైవేటు డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు సేవలందించారు. 95 శాతం మేరకు ఆర్టీసీలో నడుస్తున్న అద్దె బస్సులను వినియోగించి.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ, పోలీస్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.  – ఆర్వీ.కర్ణన్, కలెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా