వి‘రక్త’ బంధాలు

14 Nov, 2019 09:17 IST|Sakshi

మంటగలుస్తున్న మానవ సంబంధాలు

ఆస్తి పంపకాల కోసం కన్నవారినే కడతేరుస్తున్న కొడుకులు

కోడళ్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న వృద్ధులు  

ఉమ్మడి జిల్లాలో వరుస ఘటనలు 

సాక్షి, నర్సంపేట(వరంగల్‌) : మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మానవత్వం మచ్చుకైనా కనిపిస్తలేదు.. ఇది ఓ పాటలోని వాక్యం కాదు .. నిజ జీవితంలో ఎక్కడో చోట బయటపడుతున్న వాస్తవం . అయినవాళ్లు.. చివరకు అమ్మానాన్నల బంధాలకు సైతం బీటలు వారుతున్నాయి. డబ్బే పరమావధిగా అరాచకాలు చోటు చేసుకుంటున్నా యి. కన్న తల్లిదండ్రులను కొడుకు చంపడం.. కొడుకును తల్లిదండ్రులే చంపడం.. ఆస్తికోసం అమ్మానాన్నలను గెంటివేయడం.. సోదరులపై దాడి, హత్య చేయడం జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న అమానవీయ ఘటనలే ఇందుకు నిదర్శనం. 

ప్రాధేయపడినా కనికరించని కసాయి..
గత నెల 30వ తేదీన అన్న కంటే తక్కువ భూమి పంచి ఇచ్చారని వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరిచిన కన్న కొడుకు, మనుమడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటన రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. భూక్యా దస్రూ – బాజీని గొంతు కోసి ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తండ్రిని చంపిన అనంతరం తల్లిని చంపబోతుండగా వద్దని ప్రాధేయపడినా కొడుకు తల్లిని సైతం చంపడం బంధాలు రోజురోజుకు దిగజారాయని చెప్పడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. 

కొడుకు, కోడలు వేధింపులతో.. 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాళ్ల బండి రాధమ్మ(66) వృద్ధ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. వీరిని తరచూ కొడుకు , కోడలు వేధించే వారని స్థానికులు తెలిపారు. కొడుకుకు భారం కాకుడదని ముహూర్తం పెట్టుకుని వారి దహన సంస్కారాలకు సైతం డబ్బులు సమకూర్చుకుని మరీ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరెకరాలు సంపాదించి ఇచ్చినా నిత్యం కొడుకు, కోడలు సూటిపోటి మాటలే వారి ఆత్మహత్యకు కారణమైందని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కడారి మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబసభ్యులు కిరోసిన్‌ పోసి మంగళవారం సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

అక్కున చేర్చుకునేవారు లేరు.. 
రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి– శోభలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లు లేరు. వయస్సు మీద పడడంతో వీరస్వామికి ఆరోగ్యం బాగా లేదు. దీంతో వీరస్వామి దంపతులకు ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వలేదు. శోభ ఇండ్లలో పనిచేస్తూ ఎంతో కొంత వచ్చిన డబ్బులతో వారు పెట్టిన అన్నం తెచ్చి భర్తకు పెట్టి తాను తిని దయనీయ స్థితిలో జీవనం సాగించారు. గత మూడు నెలలుగా చెట్ల కిందనే దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో అనుబంధాలు.. బంధాలు అన్నది మరిచిపోయిన ఘటనలు ఇటీవల కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.

బంధాలు దూరమవుతున్నాయి..
తల్లిదండ్రులు పిల్లల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతుంది. పక్కవాళ్లను చూసి మంచి కన్నా చెడే ఎక్కువ నేర్చుకోవడం, మంచి కన్నా చెడు ఎక్కువగా నేర్చుకోవడం ఎక్కువైపోయింది. మానసిక బంధాలను ప్రేమను పెంచుకుంటే తప్పా ఒకరి బాధలను ఇంకొకరికి అర్థమయ్యేలా పిల్లలకు, పిల్లల బాధలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటేనే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడానికి అవకాశం ఉంది. 
– సృజనారెడ్డి, సైకలాజిస్ట్‌ 

మరిన్ని వార్తలు