దిగొస్తున్న ఉల్లి ధర 

24 Dec, 2019 03:10 IST|Sakshi

హోల్‌సేల్‌లో రూ.80–90, 

రిటైల్‌లో ధర రూ.100–110 

సాక్షి, హైదరాబాద్‌: ఉల్లి ధరలు క్రమంగా దిగొ స్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ.130 వరకు ఉన్న ఉల్లి ధర రూ.20 వరకు తగ్గింది. గత కొద్ది రోజులుగా కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోగా, మహారాష్ట్ర నుంచి 6 వేల నుంచి 7 వేల బస్తాల మేర మాత్రమే ఉల్లి సరఫరా జరిగింది. దీంతో హోల్‌సేల్‌ ధర రూ.110 నుంచి రూ.120 వరకు పలికింది. ఇది రిటైల్‌ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.130–140 మధ్య పలికింది. అయితే సోమవారం మలక్‌పేట మార్కెట్‌కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఏకంగా 16,650 బస్తాల ఉల్లి వచ్చింది.

దీంతో కిలో ఉల్లి ధర రూ.80–90 మధ్య పలికింది. ఇది రిటైల్‌ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.100–110 మధ్య పలికింది. ఉల్లి సరఫరా పెరిగితే జనవరి మొదటి వారానికి రిటైల్‌ మార్కెట్‌లో ధర రూ.70–80 వరకు తగ్గుతాయని అంటున్నాయి. రాష్ట్రానికి ఈజిప్టు నుంచి రావాల్సిన ఉల్లి ఇంకా రాలేదు. అయితే మలక్‌పేట మార్కెట్‌లో మాత్రం ప్రతిరోజూ మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈజిప్టు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఉల్లిని విక్రయిస్తున్నారు. సోమవారం సైతం మార్కెట్‌లో లారీ ఈజిప్టు ఉల్లిని మహారాష్ట్ర వ్యాపారి ఒకరు కిలో రూ.70కి విక్రయించడం గమనార్హం.   

మరిన్ని వార్తలు