బీటెక్‌లో ఆన్‌లైన్‌ వ్యాల్యుయేషన్‌ 

10 Jun, 2019 02:29 IST|Sakshi

ఈ విద్యా సంవత్సరపు వార్షిక పరీక్షల నుంచి అమలు 

ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎంటెక్‌లో అమలు 

మూల్యాంకనంలో రెండు దశల వెరిఫికేషన్‌ 

తేడాలు వస్తే మరోసారి మూల్యాంకనం 

జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో ఇకపై ఆన్‌లైన్‌లో వ్యాల్యుయేషన్‌ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఎంటెక్‌లో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ వ్యాల్యుయేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్‌టీయూహెచ్‌.. ఇకపై బీటెక్‌లోనూ దానిని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎంటెక్‌ పరీక్షల్లో ఆన్‌లైన్‌ మూల్యాంకన విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరే విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టాలని భావిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు పరీక్షల మూల్యాంకన విధానంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక లెక్చరర్‌ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసిన తరువాత అతనికి తెలియకుండానే దానిని మళ్లీ మరో లెక్చరర్‌తో మూల్యాంకనం చేయిస్తున్నామని, తద్వారా మూల్యాంకనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఇద్దరు చేసిన మూల్యాంకనంలో భారీ తేడాలు ఉంటే మొదట మూల్యాంకనం చేసిన లెక్చరర్‌ను పిలిపించి మళ్లీ మూల్యాంకనం చేయిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు జేఎన్‌టీయూలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతేడాది ఎంటెక్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టిన తాము ఈసారి ఎంటెక్‌లో 80 సీట్లతో డేటా సైన్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. 

కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలు.. 
ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు, కొన్ని డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లెర్నింగ్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుబంధ గుర్తింపు కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలోనే ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా ఇంజనీరింగ్‌ కాలేజీలు, సీట్లు వద్దని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు. మరోవైపు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ పరిశీలన తరువాత ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు.  

నెలాఖరులో ఇంటర్వ్యూలు.. 
ఈ నెలాఖరులో 36 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికోసం 340 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో 154 అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, రోస్టర్‌ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు