ఊరించి.. ఉసూరుమనిపించారు

5 Jun, 2014 01:50 IST|Sakshi

మోర్తాడ్, న్యూస్‌లైన్ :  ఊరించి ఉసూరుమనిపించినట్లు ఉంది ప్రభుత్వం తీరు. పంట రుణాల మాఫీలో కొన్ని మెలికలు పెడుతూ ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణ మాఫీ కొందరికే వ ర్తించే విధంగా ఉందని వారు పేర్కొంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ ఒకటి తర్వాత ఖరీఫ్, రబీ సీజనుల్లో లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించనుంది. దీంతో రెండు, మూడు ఏళ్లుగా అతివృష్టి, అనావృష్టిల కారణంగా పంట రుణాలు చెల్లించని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.  
 2013 జూన్ ఒకటో తేదీ తర్వాత పంట రుణాలు తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో 2,26,282 మంది రైతులకు సంబంధించి రూ. 1,863.65 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణాలను రెగ్యులర్‌గా రెన్యువల్ చేయించేవారికే రుణమాఫీ పథకం వర్తిస్తుందన్న మాట.

 జిల్లాలోని వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు స్వల్ప కాలిక రుణాలతోపాటు, దీర్ఘ కాలిక రుణాలు ఇచ్చాయి. ట్రాక్టర్‌ల కొనుగోలు, పంపుసెట్లు, పైప్‌లైన్, వ్యవసాయ పరికరాల కోసం దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చేశాయి. లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ భూమి ఎంత ఉన్నా లక్ష రూపాయలలోపే రుణాలు తీసుకున్నారు. కొందరు రైతులు మాత్రమే లక్ష రూపాయలకు మించి పంట రుణం పొందారు. ఎలక్షన్ల సందర్భంగా పంట రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో చాలా మంది రైతులు రెండు మూడేళ్లుగా పంట రుణాలు చెల్లించడంలేదు.

2013 జూన్ ఒకటికి ముందుగా పంట రుణం తీసుకున్నవారు రుణం చెల్లిస్తే మాఫీ వర్తించదని భావించి రుణం చెల్లించలేదు. అలాంటి రైతులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే. కాగా ప్రభుత్వం బ్యాంకర్లతో సోమవారం మరో దఫా సమావేశం కానుండడం వారిలో ఆశలను సజీవంగా ఉంచుతుంది. రుణ మాఫీ విషయంలో మార్పు చేర్పులుండవచ్చని వారు భావిస్తున్నారు. రుణ మాఫీ విధి విధానాలు ఖరారైతే  స్పష్టత వస్తుంది. ఏది ఏమైనా పంట రుణం మాఫీ విషయం లో ప్రభుత్వం చేసిన ప్రకటన కొందరు రైతులకు సంతోషం కలిగించగా మరి కొందరికి నిరాశను కలిగించింది.

మరిన్ని వార్తలు