‘మహా’భాగ్యం

13 Jun, 2018 07:46 IST|Sakshi

హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరుగా ఓఆర్‌ఆర్‌

టోల్‌ రూపంలో భారీగా పెరిగిన రాబడి  

 గతేడాది రూ.191 కోట్లు,ఈ ఏడాది రూ.312 కోట్లు 

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి ప్రత్యేకతను తీసుకోచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. రోజురోజుకు వాహనాలు పెరుగుతుండడంతో టోల్‌ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాది నెలకు రూ.16 కోట్లు వస్తే.. అదిప్పుడు ఏకంగా రూ.26 కోట్లకు చేరింది. గతేడాది వార్షికాదాయం రూ.191 కోట్లుగా కాగా ఈ ఏడాది రూ.312 కోట్లకు చేరుకుంది. తాజాగా టోల్‌ వసూలు ప్రక్రియకు టెండర్లు పిలవగా ఏడాది రూ.312 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం నెలకు దాదాపు పది కోట్లకు అదనంగా పెరిగినట్లయింది.

టోల్‌ వసూలు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞనంతో నిర్వహణ కార్యకలాపాలు జరిపేందుకు టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (టీఎంఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. టీఎంఎస్‌ ద్వారా టోల్‌ వసూలు, వాహనాల రాకపోకల సంఖ్య గణాంకాల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.  

ఏటికేడు పెరుగుతున్న ఆదాయం 
ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఫీజు 2012–13లో రూ9 కోట్లు వచ్చింది. 2013–14లో రూ.17 కోట్లు, 2014–15లో రూ.42 కోట్లకు చేరింది. 2016–17లో ఏకంగా రూ.110 కోట్లకు చేరగా.. 2017–18లో ఇప్పటికి రూ.191 కోట్లకు చేరింది. ఈ ఏడాదైతే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.313 కోట్లకు ఆదాయం పెరిగింది. రోజురోజుకు ఓఆర్‌ఆర్‌ ద్వారా వచ్చివెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పాటు ఓఆర్‌ఆర్‌ నిర్వహణకు సరైన చర్యలు తీసుకోవడం కూడా ఈ మార్గంలో వాహనదారులు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. మరో రెండు మూడేళ్లలో ఎటుచూసినా అడవిని తలపించేలా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొస్తామంటున్నారు. ‘ఓఆర్‌ఆర్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది. నగరం చుట్టూ బాహ్య వలయ రహదారి ప్రపంచంలోని ఏ నగరానికి లేదు. ఈ రహదారి వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గింది. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా గ్రోత్‌ కారిడార్‌ ఏర్పాటు చేశాం. గ్రిడ్‌ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు తెలిపారు. 

మరిన్ని వార్తలు