కనువిందుగా.. పసందుగా..

1 Oct, 2023 07:49 IST|Sakshi

హైదరాబాద్: ఆహ్లాదానికి చిరునామాలాంటి భాగ్యనగర ప్రత్యేకతలకు మరో సరికొత్త ఆకర్షణ తోడయింది. ప్రకృతి అందాలకు నిలయమైన హుస్సేన్‌ సాగర్‌ అభిముఖంగా పచ్చని సొగసుల లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ కొలువుదీరింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) తీర్చిదిద్దిన ఈ పార్క్‌ నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ను గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వాకర్స్‌ కోసం ప్రత్యేక వేళలు..
ఈ లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు వ్యాయామ అభిలాషులైన వాకర్స్‌ కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఆహ్లాదకరమైన పరిసరాల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని అందుకోవాలనే ఆరోగ్యాభిలాషులు నెలకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వేడుకలకూ.. వేదికగా..
పరిమిత బడ్జెట్‌లో చిన్న చిన్న వ్యక్తిగత వేడుకలు నిర్వహించాలని కోరుకునే నగరవాసులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ లేక్‌ ఫ్రెండ్‌ పార్కులో వంద మందికి మించకుండా బర్త్‌ డే ఫంక్షన్స్‌, గెట్‌ టుగెదర్‌ ఫంక్షన్స్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దీనికి రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా వేడుకలు నిర్వహించుకునే అవకాశాన్ని హెచ్‌ఎండీఏ కల్పిస్తోంది.

ఫుడ్‌ స్టాల్స్‌కూ చోటు..
సందర్శకుల సౌకర్యార్థం లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ లో ఫుడ్‌ స్టాల్స్‌కు కూడా చోటు కల్పించారు. కరాచీ బేకరీ అవుట్‌ లెట్‌తో పాటు మరికొన్ని అవుట్‌ లెట్స్‌ సందర్శకుల కోసం ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు