విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త!

18 Sep, 2018 13:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడానికున్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది. విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖ అధికారులను గతంలో ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి.

ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై విచారణ కొనసాగించింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరుఫున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతీ దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. మెరుగైన విద్యుత్ సరఫరాకోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు.విద్యుత్ శాఖ వాదనలను హైకోర్టు సమర్థించింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రద్దు చేసింది.

ముఖ్యమంత్రి హర్షం, పీఆర్సీ అమలుకు హామీ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకున్నదని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సిఎం చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇంది పండుగ రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారి జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుతో సిఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని, వారికి పి.ఆర్.సి.అమలు చేయాలని సిఎండిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సీఎండీ ప్రభాకర్ రావు
హైకోర్టు తీర్పు పట్ల సీఎండీ ప్రభాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, ఇవాళ కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ అన్నారు. విద్యుత్ శాఖకు ఇది ఎంతో శుభ దినమని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి పే స్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సిఎండి ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్జిజన్లు రెగ్యులరైజ్ కావడం వల్ల పొందగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు