పరిపూర్ణానంద గృహ నిర్బంధం

10 Jul, 2018 01:08 IST|Sakshi

ధర్మాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు

హైదరాబాద్‌: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఆయనను గృహ నిర్బం ధం చేశారు. ఉదయం ఆయన ఉంటున్న ప్రాంతా నికి భారీగా చేరుకున్న పోలీసులు.. పరిపూర్ణానంద స్వామిని బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు.

వెస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిపూర్ణానంద ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 8 నుంచే జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌ రహదారులన్నీ పోలీ సు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పరిపూర్ణానంద స్వామి భక్తులు జూబ్లీహిల్స్‌కు తరలి రావడంతో రహదారులన్నీ భక్త జనసందోహంతో కిటకిటలాడాయి.

నినాదాలతో దద్దరిల్లాయి. భక్తులంతా పరిపూర్ణానందను విడుదల చేయాలంటూ గొడవకు దిగారు. పోలీసులతో పలువురు భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 20 మంది భక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ వచ్చారు. అయితే చింతలను మాత్రమే లోనికి అనుమతించారు. అలాగే పీఠాధిపతి విద్యా గణేశానంద సరస్వతి కూడా పరిపూర్ణానందను పరామర్శించారు.  

పెట్రోల్‌తో అర్చకుడి హల్‌చల్‌  
పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడాన్ని జీర్ణించుకోలేని అర్చకుడు రాహుల్‌ దేశ్‌పాండే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన చేతిలో ఉన్న పెట్రోల్‌ బాటిల్‌ను తీసుకొని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు