ప్రయాణం ఓకే.. పార్కింగ్‌తోనే పరేషానీ!

1 Dec, 2017 03:08 IST|Sakshi

టికెట్‌ చార్జీ కంటే పార్కింగ్‌ బాదుడే అధికం

బైక్‌లకు తొలి 2 గంటలు రూ.6.. ఆపై ప్రతి గంటకు రూ.3

కార్లకు తొలి 2 గంటలు రూ.12.. ఆపై ప్రతి గంటకు రూ.6

పార్కింగ్‌ ఉన్న చోట చార్జీల భారం.. లేనిచోట ట్రాఫిక్‌ జరిమానాలు

సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజూ నగర సిటిజన్లలో మెట్రో జోష్‌ కనిపించింది. తొలిరోజే 2 లక్షల మంది ప్రయాణికుల జర్నీతో ఇతర మెట్రోల రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదే జోరుతో రెండోరోజు గురువారం కూడా నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గాల్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఈ రెండు మార్గాల్లోని 24 స్టేషన్లకుగాను ఐదు చోట్ల మాత్రమే పార్కింగ్‌ సదుపాయాలుండడంతో మిగతా చోట్ల పార్కింగ్‌ తిప్పలు నగరవాసులకు చుక్కలు చూపాయి. పార్కింగ్‌ సదుపాయం ఉన్న చోట చార్జీల బాదుడు.. లేని చోట స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో బైక్‌లు, కార్లు పార్కింగ్‌ చేసిన వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసి ఒక్కొక్కరి నుంచి వందల రూపాయలు జరినామా విధించారు.

ట్రాఫిక్‌ పోలీసుల బాదుడు అదనం...
ఇక ప్రధాన రహదారులపై ఉన్న మెట్రో స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన వాహనాలను గురువారం ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. బైక్‌లు, కార్లను సమీప ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఒకేరోజు సుమారు వెయ్యి వాహనాలను సీజ్‌చేసి ఒక్కో ద్విచక్రవాహనం నుంచి రూ.250.. కార్లపై రూ.350 జరిమానా విధించడం గమనార్హం.

కిటకిటలాడిన మెట్రో స్టేషన్‌లు..
మెట్రో ‘సెకండ్‌’డే జర్నీ సైతం అదుర్స్‌ అనిపించింది. ప్రధానంగా ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట, ప్రకాష్‌నగర్, రసూల్‌పురా, పరేడ్‌గ్రౌండ్స్‌ మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఎక్కడా లేనంత రద్దీ అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో, మెట్రో రైలులో సెల్పీలు దిగి జనం మురిసిపోయారు. కాగా మియాపూర్‌ స్టేషన్‌ ఆవరణలో 25 సైకిళ్లతో ఏర్పాటు చేసిన సైకిల్‌స్టేషన్‌ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. సాంకేతిక కారణాల కారణంగా రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభించలేదని ఈ కేంద్రం నిర్వాహకులు తెలిపారు.

టికెట్‌ కన్నా.. పార్కింగ్‌ చార్జీయే అధికం..
ప్రస్తుతం అందుబాటులోఉన్న ఐదు పార్కింగ్‌ ప్రాంతాల్లో బైక్‌లకు తొలి 2 గంటలు రూ.6, ఆ తరువాత ప్రతి గంట కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన పది గంటలపాటు బైక్‌ను మెట్రో స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ చేసిన వారు రూ.24 సమర్పించుకోవాలి. ఇక కార్లకు తొలి 2 గంటలకు రూ.12.. ఆపై ప్రతి గంటకు రూ.6 వసూలు చేస్తున్నారు.

ఈ లెక్కన మెట్రో స్టేషన్‌ వద్ద కారును పది గంటల పాటు పార్క్‌ చేస్తే రూ.48 చెల్లించాలి. అంటే నాగోల్‌–అమీర్‌పేట్‌ టికెట్‌ చార్జీ రూ.45 కాగా.. పార్కింగ్‌ చార్జీ రూ.48 అన్నమాట. మరోవైపు మెట్రో అధికారులు మరో ఆరు పార్కింగ్‌ కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా.. ఇంకా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.
  
మెట్రో.. ఎంతో థ్రిల్‌...
మెట్రో మొదటి అనుభవం ఎంతో థ్రిల్‌నిచ్చింది. అయితే మహిళలకు టికెట్‌ కౌంటర్ల వద్ద విడిగా క్యూలైన్‌ గానీ, రైలులో విడిగా సీట్లు గానీ లేకపోవడం కొంచెం బాధ కలిగించింది.         
–రామసుధ, అమీర్‌పేట్‌

చార్జీ భారంగా మారింది
నాగోలు నుంచి అమీర్‌పేట్‌ వరకు మెట్రో ప్రయాణం చేశా. జర్నీ బాగుంది కానీ చార్జీ భారంగా మారింది. అలాగే స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సౌకర్యం లేక వాహనం ఎక్కడ పెట్టాలో అర్ధం కాలేదు.                 
–సాయి

మరిన్ని వార్తలు