పెన్నా ప్రతాప్‌ రెడ్డికి పాక్షిక ఊరట

27 Jan, 2019 02:32 IST|Sakshi

పీసీ యాక్ట్‌ కేసు కొట్టేసిన ఉమ్మడి హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న పెన్నా ప్రతాప్‌రెడ్డికి హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అతనిపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని సెక్షన్‌ 12 కింద సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఐపీసీ సెక్షన్‌ 120(బీ), 420 కింద ఉన్న కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పెన్నా ప్రతాప్‌రెడ్డితో పాటు పెన్నా గ్రూపు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 12 కింద కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అటు పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇటు పెన్నా గ్రూపు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేశారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును మాత్రమే కొట్టేశారు. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 420 కింద ఉన్న కేసుల్లో విచారణను కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ తీర్పు ప్రభావం లేకుండా.. ఆ డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు