పనిచేసేవారికే పార్టీ పదవులు

24 Dec, 2017 02:50 IST|Sakshi

కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం!

పనిచేయకుంటే సీనియర్లనూ పక్కనపెట్టే అవకాశం

యువతకు పెద్దపీట

టీపీసీసీలో సభ్యుల సంఖ్య కుదింపు

అధిష్టానం సంకేతాలు

సాక్షి, హైదరాబాద్‌: పార్టీలో పదవుల పంపకంపై ఇక మీదట ఆచితూచి, జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పనిచేయని వారిని, అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకలాపాల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించినవారిని.. వారు ఎంత పెద్ద నాయకులైనా దూరంగా పెట్టాలని హైకమాండ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఏఐసీసీలోనూ, ఇటు టీపీసీసీలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని టీపీసీసీ ముఖ్యులకు హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

పార్టీ అధ్యక్షునిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, ఏఐసీసీ వంటి అత్యున్నత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించనున్నారు. అంతకన్నా ముందుగానే టీపీసీసీ, డీసీసీల ప్రక్షాళన జరగాలని హైకమాండ్‌ సూచించింది. దీనికోసం ప్రస్తుత టీపీసీసీ నుంచి ప్రతిపాదనలు తీసుకోనుంది. కాగా, టీపీసీసీ అధ్యక్షునితో పాటు, పూర్తిస్థాయి కమిటీని ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గం గతంలోనే తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగానే టీపీసీసీని అధిష్టానమే ప్రకటించనుందని తెలుస్తోంది. పార్టీ పదవుల విషయంలో నాయకుల పనితీరు, సమర్థత, అంకితభావం ఆధారంగానే నిర్ణయాలుంటాయని హైకమాండ్‌ స్పష్టంచేసింది.  

సీనియారిటీ ఒక్కటే సరిపోదు..
కేవలం ప్రెస్‌ మీట్లకే పరిమితం అయిన వారిని, పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటున్నవారిని కూడా పక్కన పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. సీనియారిటీ, రాజకీయ అనుభవం ఉంటే చాలదని, పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంచేసింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఈ కష్ట సమయంలో పార్టీకోసం శ్రమిస్తున్నవారికి, యువతకు తగిన అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. ‘రాజకీయాలంటే నిరంతర ప్రక్రియ. కేవలం ఎన్నికల సమయంలో టికెట్లు, పార్టీ కమిటీల నియామకాల సమయంలో పదవులను సంపాదించడమే కాదు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పార్టీ నేతలంతా ఎవరి పనులను వారు అంకితభావంతో చేయాల్సిందే.

కేవలం ఎన్నికలప్పుడే చూసుకుందామనుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. పనిచేయాలనే ఆసక్తి, పట్టుదల లేనివారికి పదవులు ఇచ్చి ఏం ప్రయోజనం? అంకితభావంతో పనిచేస్తామనే వారికే అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. నేను సీనియర్‌ను, ఇంట్లో కూర్చున్నా పదవులు వస్తాయి అనే వారికి ఈ సారి చెక్‌ పెట్టేవిధంగానే అధిష్టానం చర్యలు తీసుకుంటున్నది’అని పార్టీ ముఖ్యనాయకుడొకరు పేర్కొన్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల్లో కొందరిని పక్కనపెట్టే అవకాశం ఉందని మరో ముఖ్యనేత వెల్లడించారు. టీపీసీసీ సభ్యుల సంఖ్యను కూడా ఈ సారి భారీగా కుదించే అవకాశముందని తెలుస్తోంది. టీపీసీసీకి ఇప్పటిదాకా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారప్రతినిధులు అంతా కలిపి దాదాపు 300కు పైగా ఉన్నారు. ఈ కమిటీని 100 లోపుగా కుదించే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు