ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నారు

19 Apr, 2019 01:22 IST|Sakshi

లంచం ఇవ్వలేక  పాస్‌ పుస్తకాలు తీసుకోలేదు  

మావోయిస్టు నేత తల్లి  మధురమ్మ ఆవేదన 

పెద్దపల్లి: ‘స్వాతంత్య్ర పోరాటం చేసిన నా భర్త వెంకటయ్యకు ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఎనిమిదేళ్లు సాగు చేసుకున్నం.. పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వమంటే రామగుండం రెవెన్యూ అధికారులు అప్పు డు రూ.10 వేల లంచం అడిగిండ్రు. లంచం ఇవ్వలేక పట్టాదారు పాసుపుస్తకం తీసుకోలేదు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రాజెక్టు పేరిట తీసుకున్నరు’ అని స్వాతం త్య్ర సమరయోధుడు వెంకటయ్య భార్య, మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణు తల్లి మల్లోజుల మధురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకుంది.

రజాకార్లతో పోరాడిన తన భర్తను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి రామగుండం మండలం ఎల్లంపల్లిలో ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు లంచం అడిగినందుకు ఆగ్రహంతో పాసు పుస్తకం తీసుకోలేదని తెలిపారు. సర్వే నంబర్‌ 126లోని ఎనిమిది ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయిందని అధికారులు చేతులెత్తేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు స్థానిక అధికారులను కలిస్తే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని దాటవేస్తున్నారని తెలిపారు. భూమికి ప్రతిఫలంగా  మరోచోట భూమిని కేటాయించాలని వేడుకుంది. 

మరిన్ని వార్తలు