నలుగురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్‌

18 Aug, 2023 03:30 IST|Sakshi

తహసీల్దార్, డీటీ, సీనియర్‌ అసిస్టెంట్, వీఆర్వోపై వేటు 

భూ అక్రమాలకు పాల్పడటమే కారణం

మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం­లో భూ అక్రమాలకు పాల్పడిన స్థానిక తహ­సీల్దార్‌ సీహెచ్‌ కృష్ణారావు, డీటీ జి.జగదీశ్వరరావు, సీనియర్‌ అసిస్టెంట్, ఇన్‌చార్జి ఆర్‌ఐ ఎంవీఎం శేషాచలం, పన్నూరు గ్రామ వీఆర్వో డి.శివారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ దినేష్‌కుమా­ర్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. మర్రిపూడి మండలంలోని పన్నూరులో సర్వే నంబర్‌ 12–2, 169–1, ఇతర సర్వే నంబర్లలో 143.29 ఎకరాల పట్టా భూమికి ఆ గ్రామ వీఆర్వోతో పా­టు ఆర్‌ఐ కలిసి రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఫ్యామిలీ ట్రీ అనే ఒక పత్రం తయా­రు చేసి అసలైన వారసులకు కాకుండా సంబంధం లేని 65 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందుకు సిఫారసు చేశారు.

అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డీటీ జగదీశ్వరరావు కూ­డా పూర్తిగా పరిశీలించకుండా పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుత తహసీల్దార్‌ కృష్ణారావు కూడా వాటిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చే­శా­రు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన భూము­ల్లో 71.75 ఎకరాలను వారం రోజుల్లోనే వీఆ­ర్వో శివారెడ్డి బంధువుల పేర్లమీద రిజి్రస్టేషన్‌ చేశారు. దీనిపై హక్కుదారులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు భూముల మీదుగా గ్రీన్‌­ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు వెళ్తున్నందున రెవె­న్యూ అధికారులంతా కలిసి అక్రమాలకు పాల్ప­డ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మొత్తం అంశంపై కనిగిరి ఆర్డీవోతో విచారణ చేపట్టిన కలెక్టర్‌..ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం భూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేశారు. ఆ భూములకు సంబంధించి 91 మంది వారసులు ఉండగా, వీఆర్వో శివారెడ్డి తన బంధువుల పేర్ల మీద అక్రమంగా రిజి్రస్టేషన్‌ చేయించుకున్నారని, అం­దుకు మిగతా రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి సహకరించారని తేలడంతో నలుగురు రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు