పోటెత్తిన పెద్దగట్టు

11 Feb, 2015 00:41 IST|Sakshi
పోటెత్తిన పెద్దగట్టు

సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర మూడోరోజు కూడా భక్తులతో హోరెత్తింది. మంగళవారం సంప్రదాయం ప్రకారం చంద్రపట్నం వేసి స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు బారులుతీరారు. రాత్రి వరకు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అంచనా. పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడంతో విద్యార్థులు కూడా పెద్దఎత్తున వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. శివనామస్మరణంతో భక్తులు కొప్పెర మధ్య గరుడ దీపంతో వచ్చి మొక్కులు చెల్లించారు. మంగళవారం కూడా పెద్ద ఎత్తున భక్తులు గొర్రెపొట్టేళ్లు, మేకపోతులను బలిచ్చారు. జాతరలో భాగంగా నాలుగోరోజు బుధవారం నెలవారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.   
 
టీడీపీకి అధికారం కల్ల: తలసాని


మోకాళ్లతో నడిచి తపస్సు చేసినా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరను సదర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కొంతమంది బ్రోకర్లను నమ్ముకొని చంద్రబాబు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పడుతుందని హెచ్చరించారు. యాదగిరిగుట్ట వలే దురాజ్‌పల్లి గుట్టను అభివృద్ధి చేస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు