ఆహార ‘శైలి’ మారింది!

26 Apr, 2020 04:13 IST|Sakshi

కరోనా నేపథ్యంలో పోషక ఆహారానికి ప్రాధాన్యం

బ్రౌన్‌రైస్, పిండి వంటలు, గుడ్లు, పండ్ల వినియోగం

జొమాటో, స్విగ్గీ సేవల నిలుపుదలతో స్వయం పాకాలకే మొగ్గు

చికెన్‌ బిర్యానీ, బటర్‌ చికెన్, పానీపూరి, దహీవడ కోసం గూగుల్‌లో అత్యధిక శోధనలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో జనాలంతా ఇంటికే పరిమితమవడంతో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రోజువారీ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. మామూలు రోజుల్లో తీసుకునే ఆహారానికి బదులు పోషకాలున్న ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ఖాళీ సమయాల్లో అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వంటి అనారోగ్యాల బారిన పడరాదన్న వైద్యుల సూచనలకు అనుగుణంగా తమ ఆహార శైలిని మార్చుకుంటున్నారు. తృణధాన్యాలు, బ్రౌన్‌రైస్, బ్రెడ్, పాలు, చేపలు, గుడ్లు, చికెన్‌ వంటి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

సమతుల ఆహారానికి ప్రాధాన్యం..
లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడటంతో బయటి నుంచి ఆహారం తెచ్చుకొని తినే పరిస్థితులు లేవు. దీంతో ఇంటి ఆహారం తప్పనిసరైంది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో సమతుల ఆహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పప్పుల వినియోగం పెరిగింది. పిండి వంటకాలు ఎక్కువగా వండుతున్నారు. హెర్మల్‌ టీ తాగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లు మూతపడినప్పటికీ రాష్ట్రంలో ఆరెంజ్, దానిమ్మ, అరటిపళ్లు, మోసంబి, వాటర్‌ మిలన్‌ల సగటు వినియోగం ప్రతి రోజూ 20 వేల క్వింటాళ్లకు పైనే ఉంది. పండ్లను స్వయంగా ఇంటికే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వీటి వినియోగం పెరిగింది. ఇక సగటున వారానికి డజన్‌ కోడి గుడ్లను తినే కుటుంబాలు ఇప్పుడు రెండు డజన్లు తింటున్నాయి. 

యూట్యూబ్‌ చిట్కాలతో వంటలు.. 
రాష్ట్ర ప్రభుత్వం జొమాటో, స్విగ్గీ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో స్వయం పాకం తప్పనిసరైంది. వంట చిట్కాలకై ఎక్కువగా బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. కేక్‌ మొదలు, బర్గర్‌ వరకు, బటర్‌ చికెన్‌ నుంచి చికెన్‌ బిర్యానీ వరకు ఎలాంటివి తినాలన్నా.. చిట్కాలకై యూట్యూబ్‌ వీడియోలు, పలు వంటకాల యాప్‌లపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చికెన్‌ బిర్యానీకై సుమారు 15 లక్షల మంది గూగుల్‌లో శోధించారు. చికెన్‌ టిక్కా మసాలా, తందూరీ చికెన్, పాలక్‌ పన్నీర్, దహీవడ, పానీపూరి, కేక్‌ల తయారీకై శోధించిన వారి సంఖ్య ఈ నెల రోజుల్లో 120 శాతం పెరిగిందని ఆన్‌లైన్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా కుటుంబాలు కలిసి భోజనం చేస్తుండటంతో ఆరోగ్యకర భోజనం వండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేల్లో తెలింది. 

నో డ్రింక్స్‌.. ఓన్లీ పాలు, పెరుగు.. 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాన కూల్‌డ్రింక్స్‌ సంస్థలన్నీ తమ ఉత్పత్తులను నిలిపివేయడంతో వాటి లభ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో కూల్‌డ్రింక్స్‌ స్థానంలో పాలు, పెరుగు వినియోగం పెరిగిందని సర్వేల ద్వారా తెలుస్తోంది. స్వీట్స్‌ వంటి వాటికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్‌ పాల వినియోగం లాక్‌డౌన్‌ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని సర్వేలు తెలిపాయి. డ్రింక్స్‌కు బదులు ప్రతి ఇంట్లో వేసవి తాపానికి విరుగుడుగా ఇప్పుడు చల్లని మజ్జిగ, నిమ్మకాయ రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా అన్ని రంగాలపై ఆర్థిక వ్యవస్థ తన ప్రభావం చూపుతున్నందున ప్రజలు తినడానికి రెస్టారెంట్లు, బార్లకు రారని తెలిపింది. ఆరోగ్య భయాలతోనూ బయటి ఆహారాన్ని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 40 శాతానికి పైగా రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని తెలిపింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు