ఊరెళ్తే..చెప్పండి

10 Jan, 2019 10:49 IST|Sakshi

పండగ ప్రయాణాలపై సమాచారం తెల్పాలి

ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ పిలుపు

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తుంటే సమాచారం ఇవ్వాలని సిటీ కొత్వాల్‌ అంజనీకుమార్‌ కోరారు. చుట్టుపక్కల వారితో పాటు సెక్టార్‌ ఎస్‌ఐ, అక్కడ గస్తీ తిరిగే బ్లూకోల్ట్స, రక్షక్‌ వాహనాలకు ఈ విషయం చెప్పాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఆయా ఇళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచడం ద్వారా నేరాలు నిరోధించడానికి ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాచకొండలో హల్‌చల్‌ చేసిన సీరియల్‌ స్నాచర్ల అరెస్టు నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంజనీకుమార్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘నగరంలో నేరాలు నిరోధించడంతో పాటు జరిగిన వాటినీ కొలిక్కి తేవడానికి కీలక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాచకొండలో వరుస స్నాచింగ్స్‌ జరిగాయని తెలిసిన వెంటనే ఇక్కడా అప్రమత్తమయ్యాం. మొత్తం 120 బృందాలను రంగంలోకి దింపాం.

వీళ్లు 600 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌తో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు 2 వేల లాడ్జిల్లో తనిఖీలు చేశారు. ఉత్తరాదిలోని అనేక పోలీసు విభాగాలతో సంప్రదింపులు జరిపారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం సహకరిస్తూ అనుమానితుల్ని పట్టుకోవడానికి నాలుగు రోజుల్లో 21 వేల ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి 1600 వాహనాలపై నెంబర్‌ ప్లేట్స్‌ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. కేవలం చట్ట పరిధిలో మాత్రమే రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్లు వేరువేరు. నేరాల నిరోధం, నేరగాళ్లను పట్టుకునే విషయంలో మేమంతా ఒక్కటే. ఇలాంటి ఉదంతాల నేపథ్యంలో సమర్థంగా స్పందించేందుకు జోనల్‌ కంట్రోల్‌రూమ్స్‌ పనితీరును పరిపుష్టం చేశాం. ఈ స్నాచింగ్‌ కేసులు కొలిక్కి రావడంలో సీసీ కెమెరాల ఫీడ్‌ సైతం కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం సిటీలో వీటి సంఖ్య 2.5 లక్షలకు చేరింది. అయితే వీటిలో అనేకం ప్రధాన రహదారుల్లోనే ఉన్నాయి. అందుకే ఈ అంతరాష్ట్ర స్నాచర్లు అవకాశం ఉన్నంత వరకు వాటిని వదిలి ప్రయాణించారు. ప్రజలు ముందుకు వచ్చి సహకరిస్తూ నేను సైతం ప్రాజెక్టు కింద ఆయా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తే సీసీ కెమెరాల సంఖ్య 5 లక్షలకు చేరుతుంది. గత ఏడాది సిటీలో నేరాలు ఆరు శాతం తగ్గాయి. ప్రజల సహకారంతో ఈ ఏడాది మరో ఐదు శాతం తగ్గిస్తాం’ అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్‌ డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, సంతోష్‌నగర్, వనస్థలిపురం, రాచకొండ క్రైమ్‌ ఏసీపీలు శివరామ్‌శర్మ, గాంధీ నారాయణ, శ్రీధర్, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, మధుమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు