పల్లె స్ఫూర్తితో ‘పట్టణ ప్రగతి’

27 Jan, 2020 01:29 IST|Sakshi

పట్టణాల అభివృద్ధిలోనూ ప్రజలు పాలుపంచుకోవాలి

71వ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన వేడుకకు హాజరైన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పల్లెలు, పట్టణాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకుపోతోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రెండు విడతలుగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైందని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజ లకు సూచించారు. ‘పల్లె ప్రగతిలో ప్రజలంతా కలిసి ఎవరి గ్రామాన్ని వారు అద్దంలా తీర్చిదిద్దుకున్నారు. మన ఊరిని మనమే బాగుచేసుకోవాలనే చైతన్యంతో ముందుకు సాగారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలి. పల్లెల మాదిరే పట్టణాల రూపురేఖలు కూడా మారాల్సిన అవసరం ఉంది. పల్లె ప్రగతి మాదిరిగానే ‘పట్టణ ప్రగతి’కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమంలోనూ ప్రజలంతా పాల్గొని, ఎవరి పట్టణాన్ని వారే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి’అని గవర్నర్‌ అభిలషించారు.

హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని గవర్నర్‌ హోదాలో తొలిసారి తమిళిసై ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తన ఉపన్యాసంలో రాజ్యాంగ నిర్మాతలు, దేశ ప్రముఖులు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అత్యున్నత ఫలితాలు సాధించిందని ప్రశంసించారు. 

కేసీఆర్‌ నాయకత్వంలో బలమైన పునాదులు..
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అసంఖ్యాక సవాళ్లను అధిగమించి సుపరిపాలన అందిస్తోందని గవర్నర్‌ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన అగాధం నుంచి తెలంగాణ వేగంగా కోలుకుని, అతి స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో గడిచిన ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకుందని, సానుకూల దృక్పథంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తనకు తానుగా పరివర్తన చెందుతూనే, ప్రజాస్వామ్య–గణతంత్ర భారతదేశంలో గుణాత్మక మార్పులకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.

సరికొత్త సంస్కరణలతో పాలనా రంగంలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం పెంచడానికి ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని, కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టాల ప్రకారమే అత్యంత కట్టుదిట్టంగా పాలన జరుగుతోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన జాబితాలో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలకు చోటు దక్కిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. పల్లెలు, పట్టణాల ప్రగతి కోసం గతంలో ఉన్న నిధుల కొరత సమస్యను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని, కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సరిసమానంగా పల్లెలకు, పట్టణాలకు నిధులు అందచేయడానికి ముందుకొచ్చిందని గవర్నర్‌ తెలిపారు. 

ఈ ఏడాది రెండు టీఎంసీల ఎత్తిపోత..
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది నుంచి ప్రతి రోజూ రెండు టీఎంసీల చొప్పున, వచ్చే ఏడాది నుంచి ప్రతి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తామని పేర్కొన్నారు. ‘కృష్ణా నది నీటి లభ్యతలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్య పరిష్కరం కోసం గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గోదావరి జలాల తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో కలిసి ముందుకు పోయేందుకు సిద్ధపడింది’అని తెలిపారు. 

త్వరలో హెల్త్‌ ప్రొఫైల్‌..
కంటి వెలుగు కార్యక్రమం స్ఫూర్తితో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగానే నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని గవర్నర్‌ తెలిపారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు జరిపి, వాటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌’రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మహిళలపై అఘాయిత్యాలు చేసే వ్యక్తుల పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలోని 130 అతిపెద్ద నగరాల్లో అధ్యయనం చేసిన ప్రపంచ ప్రఖ్యాత జేఎల్‌ఎల్‌ సంస్థ, 20 అగ్రశ్రేణి నగరాల జాబితాను ఇటీవల ప్రకటిస్తే, అందులో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.  

>
మరిన్ని వార్తలు