దద్దరిల్లిన జనగామ

10 Sep, 2019 12:39 IST|Sakshi
నిరసనకారులతో జనగామ కలెక్టరేట్‌ ఏరియా

కలెక్టరేట్‌ ఎదుట నిరసనల హోరు

సమస్యలపై గళమెత్తిన కార్మికులు, పార్టీలు

సాక్షి, జనగామ: సమస్యల పరిష్కారం కోసం ‘జనగామ’ గళమెత్తింది. పట్టణ సమస్యలపై ఒకరు.. కార్మికుల కష్టాలపై మరొకరు.. మా భూములు మాకిప్పించాలని బాధిత కుటుంబాలు.. సంచార జాతులు.. కుల ధ్రువీకరణ, గోదావరి జలాల కోసం తలపెట్టిన నిరసనలతో సోమవారం కలెక్టరేట్‌ దద్దరిల్లిపోయింది. ధర్నాలు లేని తెలంగాణ వస్తదని చెప్పిన పాలకుల మాటలకు ఆచరణలో విరుద్ధంగా కనిపిస్తుంది. జనగామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  కలెక్టరేట్‌ ప్రాంగణంలో సంఘాలు.. పార్టీలు.. భూసంబంధిత సమస్యలపై ఎనిమిది ధర్నాలు, దీక్షలు జరిగాయి. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో కలెక్టరేట్‌ రహదారి నిండిపోయింది. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కావడంతో పోలీసులు ఇరిగేషన్‌ కార్యాలయం నుంచి దారి మళ్లించారు. ధర్నాలు, దీక్షలతో కలెక్టరేట్‌ ప్రాంగణం హోరెత్తిపోగా గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టారు.

పట్టణ సమస్యలపై ఇటీవల సీపీఎం నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో జనగామ మునిసిపల్‌ కార్యాలయం ఎదుట భైఠాయించారు.  మరిగడి గ్రామంలోని కొత్తచెరువుకు గోదావరి జలాలను తీసుకురావాలని 500 మంది గ్రామస్తులతో కలెక్టరేట్‌ను ముట్టడించా రు. వడిచర్ల గ్రామంలో కుర్మకులస్తులకు చెందిన భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి 110 కుటుంబాలకు పట్టాలుచేసి ఇవ్వాలని నిరసన తెలిపారు. చేనేతరంగాన్ని ఆదుకోవడంతో పాటు జిల్లాలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని తలపెట్టిన దీక్షకు ప్రొఫెసర్‌ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర బీసీ జాబితాలో పూసల కులం పేరును చేర్చే విధంగా చూడాలని పూసల కులస్తులు కలెక్టరేట్‌ ఎదుట భైఠాయించారు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని యాచకవృత్తి చేసుకునే 25 కుటుంబాలు కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పలువురు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.

కోదండరాం రాక.. నిరసనలకు మరింత ఊపు
చేనేత కార్మికుల దీక్షను ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రొఫెసర్‌ కోదండరాంతో నిరసనకారులకు కొత్త ఊపునిచ్చినట్లుగా మారిపోయింది. చేనేత దీక్షలను ప్రారంభించి నేరుగా మరిగడి వాసుల వద్దకు వెళ్లి సంఘాభావం ప్రకటించారు. దీంతో కలెక్టరేట్, మునిసిపల్‌ రెండు ప్రధాన గేట్లను పోలీసులు మూసివేయడంతో నిరసనకారులు లోనికి వెళ్లే ప్రయత్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కలెక్టరేట్‌ ఏరియా ఆందోళన కార్యక్రమాలతో బిజీబిజీగా కనిపించింది.

మరిన్ని వార్తలు