‘ఒకే చోట అనుమతి’పై ఆర్డినెన్స్!

28 Sep, 2014 00:23 IST|Sakshi

పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
 
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులనూ ఒకే చోట అందించేందుకు ఉద్దేశించిన ‘రైట్ టు సింగిల్ విండో’ విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. దేశంలోనే అత్యుత్తమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రైట్ టు సింగిల్ విండో’ విధానం కింద పారిశ్రామికవేత్తల ప్రతిపాదనలపై పక్షం రోజుల్లోగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సకాలంలో అనుమతులు ఇవ్వడంలో ఏ అధికారైనా జాప్యం చేస్తే... వారి వేతనంలో కోత విధించి ఆ మొత్తాన్ని పారిశ్రామికవేత్తలకు పరిహారంగా ఇస్తారు.

ఈ విధానంపై శనివారం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ తదితరులు సచివాలయంలో సీఎంతో సమావేశమై చర్చించారు. ఈ విధానంపై ఆర్డినెన్స్ జారీ చేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
 
 

మరిన్ని వార్తలు