‘పంచాయతీ’ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి

26 Dec, 2018 02:28 IST|Sakshi

హైకోర్టులో బీసీ సంఘాల పిటిషన్‌ 

నేడు విచారించనున్న ధర్మాసనం  

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడంతోపాటు బీసీ ఓటర్లను లెక్కించి, వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ మహాజన సమితి ప్రతినిధి యు.సాంబశివరావు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ సంయుక్తంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో న్యాయశాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టర్, తెలంగాణ బీసీ సహకార ఆర్థిక సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై నేడు(బుధవారం) ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

అశాస్త్రీయ గణన వల్లే బీసీలకు సమస్య...
ఈ ఆర్డినెన్స్‌ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని, అయితే, ఈ తీర్పులన్నీ కూడా బీసీ జనాభా, బీసీ ఓటర్ల లెక్కలు తేల్చకుండా జారీ చేసినవాటికి మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా తేల్చిన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చారంటూ వాటిని న్యాయస్థానాలు కొట్టేశాయని వివరించారు. పూర్తిస్థాయిలో బీసీ జనాభా, ఓటర్లు తేలితే తప్ప, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తమిళనాడులో సర్వీసు రంగంలో 69 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు అనుమతించిందని, అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు 69 శాతం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 

సమగ్ర కుటుంబ సర్వే లెక్కలున్నాయిగా...
2014లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని, ఇందులో బీసీ జనాభా 55 నుంచి 67 శాతం వరకు ఉన్నట్లు తేలిందని పిటిషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టుగానీ, ఏ హైకోర్టుగానీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించలేదని తెలిపారు. కేవలం శాస్త్రీయపద్ధతిలో బీసీ జనాభాను లెక్కించకపోవడాన్నే న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 243ఈ ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కాబట్టి బీసీ జనాభా లెక్కలను తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని వారు వివరించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉంటుందని, కాబట్టి ముందుగానే బీసీ జనాభాలెక్కలను సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతఅని అన్నారు. 

రాజ్యాంగాన్ని మోసం చేయడమే
ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి, బీసీ రిజర్వేషన్లను 34 శాతానికే పరిమితం చేసిందని పిటిషనర్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం, బీసీల రిజర్వేషన్లను మాత్రం తగ్గించిందన్నారు. అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావడం బీసీలను, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనన్నారు. అందువల్ల ఆర్డినెన్స్‌ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

ముందు బీసీల లెక్కలను తేల్చమని హైకోర్టు చెప్పింది
బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా ఈ ఏడాది జూన్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని, దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పిటిషనర్లు పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది జూన్‌ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ముందు బీసీ జనాభా, ఓటర్ల గణనను పూర్తి చేసి ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టంగా చెప్పిందన్నారు. అక్టోబర్‌లో కూడా బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాత మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇంత స్పష్టంగా హైకోర్టు ఆదేశాలున్నా రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ జనాభా లెక్కలను తేల్చేందుకు చట్టం 15 రోజుల గడువునిస్తుంటే, ప్రభుత్వం మాత్రం 11–14 నెలల గడువు కావాలని కోరుతోందన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో స్టే ఎత్తివేత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, తద్వారా బీసీల ప్రయోజనాలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. 

మరిన్ని వార్తలు