నీటి ప్రాజెక్టులకు నిధులిస్తాం: పీఎఫ్‌సీ

1 Mar, 2018 05:07 IST|Sakshi

సీఎస్, జెన్‌కో సీఎండీలతో సంస్థ చైర్మన్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు చేపడుతున్న పవర్‌ ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు ఆర్థిక చేయూత అందించిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా (పీఎఫ్‌సీ)..  నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ సదుపాయాలు కల్పించేందుకు సైతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. పీఎఫ్‌సీ చైర్మన్‌ రాజీవ్‌ శర్మ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్‌ సౌధలో జెన్‌ కో, ట్రాన్స్‌ కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావుతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై చర్చించారు.

800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మణుగూరు ప్లాంటు నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల చివరి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభాకర్‌ రావు చెప్పారు. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి ప్లాంటులోని రెండు యూనిట్లను ఈ ఏడాది డిసెంబర్‌ చివరికి, మిగతా రెండు యూనిట్లను వచ్చే ఏడాది జూన్‌కు ప్రారంభిస్తామని వెల్లడించారు. 4,000 మెగావాట్ల యాదా ద్రి పవర్‌ ప్లాంటు నిర్మాణం వేగంగా జరగుతున్నదని చెప్పారు. 3,000కు పైగా మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తిని తెలంగాణ సాధించిందని వెల్లడించారు.

10వేల మైలురాయిని దాటిన విద్యుత్‌ డిమాండ్‌
రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 10వేల మైలురాయిని దాటింది. బుధవారం ఉద యం 10,100 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని పీఎఫ్‌సీ చైర్మన్, ఇతర అధికారులు గుర్తించారు. ఇంత డిమాండ్‌ ఏర్పడినా ఎక్కడా  కోత లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం అభినందనీయమని ప్రభాకర్‌ రావు అన్నారు.  

మరిన్ని వార్తలు