పోలీస్‌ క్యాడెట్లకు ముందే శిక్షణ పూర్తి

26 Jun, 2020 04:01 IST|Sakshi

ఇంటిముఖం చూసి వందరోజులపైనే..

కరోనా ఎఫెక్ట్‌తో మొదటి సెమిస్టర్‌ సెలవులు రద్దు

ఇప్పటికే రెండో సెమిస్టర్‌ మొదలు

వారం ముందే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్‌ శిక్షణ పొందుతున్న కేడెట్లకు ఈసారి నిర్ణీత సమయానికి ముందే శిక్షణ పూర్తి కానుంది. కరోనా దెబ్బకు సెమిస్టర్‌ సెలవులు లేకుండా నిరంతరాయంగా శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. లాక్‌డౌన్‌ విధించిన తరువాత క్యాడెట్లు ఇంతవరకూ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు. క్యాడెట్లు కరోనా బారిన పడకుండా దాదాపు 105 రోజులుగా అందరినీ తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)తోపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. ఎవరికీ ఔటింగ్‌ ఇవ్వడం లేదు. క్యాడెట్లను చూసేందుకు అకాడమీలోకి వారి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కూడా అనుమతించడం లేదు. మరీ అత్యవసరమైతే తప్ప బయటికి పంపడం లేదు. ఒకవేళ వెళ్లినా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో వారంతా కేవలం ఫోన్లతోనే కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఈసారి క్యాడెట్లందరికీ శిక్షణ ముందే ముగియనుందన్న వార్త కాస్త ఊరటనిస్తోంది.

మొదటి సెమిస్టర్‌ సెలవులు రద్దు.. 
రాష్ట్రంలో జనవరి 18న టీఎస్‌పీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీటీసీలలో దాదాపు 17,200 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. వీరికి అప్పట్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వీలుండేది. మార్చి 8, 9వ తేదీల్లో క్యాడెట్లకు సెలవులు ఇచ్చారు. తరువాత అనుకోకుండా 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధించారు. అప్పటి నుంచి క్యాడెట్లకు కరోనా సోకకుండా ఔటింగులు ఆపేశారు. కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు. వీరికి రెండు సెమిస్టర్లలో సిలబస్‌ పూర్తి అవుతుంది.

మే నెలలో 4,5,6,7 తేదీల్లో తొలిసెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం.. వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్‌ హాలీడేస్‌ ఇవ్వాలి. కానీ, బయటికి వెళితే.. కేడెట్ల ఆరోగ్యానికి ముప్పు ఉండటంతో సెలవులు రద్దు చేశారు. మే 8 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించారు. వీరికి శిక్షణ ముగిసి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ (పీవోపీ) అక్టోబరు 12న జరగాలి. సెమిస్టర్‌ హాలీడేస్‌ ఇవ్వలేదు కాబట్టి పీవోపీ మరో వారం ముందుకు జరిగి అక్టోబరు 4 లేదా 5వ తేదీల్లో జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

జ్వరం, జలుబుతో పలువురు.. 
అకాడమీల్లో పలువురు క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారు. నగరంలోని యూ సుఫ్‌గూడలో శిక్షణ పొందుతున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ క్యాడెట్లు 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరంతా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా వీరిని ప్రత్యేక బ్యారెక్‌లలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు టీఎస్‌పీఏలోనూ 50 మందికిపైగా క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది. టీఎస్‌పీఏలో కరోనా అనుమానితులకు గోల్గొండ, సరోజినీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయిస్తున్నారు.

మరిన్ని వార్తలు